అన్నానగర్: మరమ్మతుకు గురై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన క్రోంపేటలో శనివారం జరిగింది. చెన్నై సమీపంలోని తాంబరం నుంచి శనివారం కంకర రాళ్ల లోడుతో రెండు లారీలు పల్లావరం వైపు బయలుదేరాయి. క్రోంపేట బస్టాండ్ సిగ్నల్ సమీపంలో జీఎన్‌టీ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక ఉన్న లారీ ఢీకొంది. వెనుక లారీ ముందు భాగం ధ్వంసమవడంతో రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో మరైమలై నగర్ నుంచి వస్తూ క్రోంపేటలో కార్ల ఫ్యాక్టరీ కార్మికులను దింపి గిండి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బైకుపై టీ విక్రయించే వ్యాపారిని ఢీకొని, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. దిండుగల్‌కు చెందిన కారు డ్రైవర్ సరన్‌రాజ్ (24), కారులో ముందు సీటులో కూర్చున్న ప్రైవేట్ సంస్థ సెక్యూరిటీ రాజేంద్రన్ (54)లు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. టీ వ్యాపారి త్యాగరాజన్ (34) తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుడిని క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment