ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్ల పట్టివేత  | Two smugglers arrested in a single day | Sakshi
Sakshi News home page

ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్ల పట్టివేత 

Published Fri, Dec 21 2018 1:15 AM | Last Updated on Fri, Dec 21 2018 1:15 AM

Two smugglers arrested in a single day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి దేశంలోకి ప్రవేశించిన తరవాత దేశవాళీ సర్వీసులుగా మారే విమానాలు కేంద్రంగా సాగుతున్న బంగారం అక్రమ రవాణా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు గురువారం ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ నిఘాకు చిక్కకుండా స్మగ్లర్లు అనుసరిస్తున్న ఈ విధానంపై కొంతకాలంగా కన్నేసిన అధికారులు వరుసగా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. జెడ్డా నుంచి త్రివేండ్రం మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన కేరళవాసి అర కిలో బంగారాన్ని ‘రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌’పంథాలో తీసుకువస్తూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు. అలాగే, బహ్రెయిన్‌ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‌వాసిని పట్టుకున్న అధికారులు మరో 460 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు స్మగ్లర్లు చిక్కడం గమనార్హం. అంతర్జాతీయంగా నడిచే విమానాలపై కస్టమ్స్‌ తనిఖీలు ముమ్మరం చేయడంతో స్మగ్లర్లు పంథా మార్చుకున్నారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా, ఆపై డొమెస్టిక్‌గా మారిపోయే విమానాలను ఎంచుకుని వాటి ద్వారా రవాణా ప్రారంభించారు. స్మగ్లింగ్‌ ముఠాసభ్యులు ఆ విమానం ప్రారంభమయ్యే ప్రాంతంతోపాటు దేశవాళీ సర్వీసుగా మారే ప్రాంతంలోనూ ముందే ప్రయాణికుల రూపంలో కాచుకుని ఉంటారు. సాంకేతిక పరిభాషలో వీరిని క్యారియర్లుగా పేర్కొంటారు. వీరు చిక్కినా లింకు ముందుకు సాగడం కష్టం. ఆయా దేశాల్లో ఆదాయపుపన్ను లేకపోవడంతో మనీలాండరింగ్‌ సమస్య ఉత్పన్నం కాదు. ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేరళవాసి ప్రయాణించిన విమానం అక్కడి నుంచి కేరళలోని త్రివేండ్రానికి అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తుంది. ఆపై డొమెస్టిక్‌ సర్వీసుగా మారిపోయి హైదరాబాద్‌కు వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు దీనిని ఎంచుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. అత్యధికశాతం స్మగ్లర్లు బం గారాన్ని బ్యాగుల అడుగుభాగంలో ఉండే తొడుగు లు, లోదుస్తులు, రహస్యజేబులు, బూట్ల సోల్, కార్ట న్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పౌడర్‌ డబ్బాలతోపాటు మొబైల్‌ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపం లోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చేవారు. తాజాగా రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌ జోరు గా సాగుతోందని కేరళవాసి ఉదంతం బయటపెట్టింది. 

స్మగ్లర్లు పట్టుబడింది ఇలా... 
సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు(రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌) చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కిలోల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తాజా ఉదంతం స్పష్టం చేసింది. ఈవిధంగా కేరళవాసి రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌లో అర కిలో బంగారం పెట్టుకుని వచ్చి పట్టుబడ్డాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బహ్రెయిన్‌ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ వాసి 460 గ్రాముల బంగారా న్ని బ్యాగ్‌ అడుగుభాగంలో దాచి తీసుకువస్తూ పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో ఎవరికి చేరవేయడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement