
కిందపడిపోయిన నిందితుడి బైకు
ఒంగోలు: ఒంగోలు డీఎస్పీ కార్యాలయం ఎదుట గురువారం ఓ ద్విచక్ర వాహనదారుడి హల్‌చల్‌తో జనం బెంబేలెత్తారు. ఉదయం 11 గంటల సమయంలో ఎల్‌జీ కంపెనీ టీవీలకు మెకానిక్‌గా పనిచేస్తున్న జె.పంగులూరు మండలం చందలూరుకు చెందిన దొడ్డి మల్లికార్జున్ కొత్తపట్నం బస్టాండ్ నుంచి ఇందుర్తినగర్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో కొప్పోలు వైపు నుంచి టౌన్‌లోకి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొన్నాడు. మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డాడు.
అయినా ప్రమాదానికి కారణమైన వ్యక్తి బైకు వేగాన్ని తగ్గించకుండా కొత్తపట్నం వైపు నుంచి నగరంలోకి వస్తున్న జయరావ్ అనే కానిస్టేబుల్ బైకును ఢీకొట్టాడు. బైకులు తీవ్రంగా ధ్వంసం కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తి జనం తేరుకునేలోపే ఘటన స్థలం నుంచి అదృశ్యమయ్యాడు. అతడి బైకు నుంచి సీలలు బయట పడటంతో అతను ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియనై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌తో పాటు అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు బైకు మీద ఉన్నారు. చిన్న పిల్లవాడు రెండు బైకుల మధ్యలో ఇరుక్కోగా కానిస్టేబుల్ భార్య, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. విషయం తెలియగానే టూటౌన్ సీఐ సురేష్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.