
అక్కాచెల్లెలు పద్మ, జ్యోతి మహేందర్‌యాదవ్ (ఫైల్)
హైదరాబాద్: భర్త వేధింపులు భరించలేక ఇద్దరు భార్యలు అతనికి చున్నీతో ఉరేశారు. చనిపోయాడో.. లేదో.. అన్న అనుమానంతో మృతదేహాన్ని బయటికి లాక్కొచ్చి తగుల బెట్టారు. తండ్రి హత్యకావడం.. తల్లులు జైలుపాలవడంతో వీరి ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్‌బేస్టస్ కాలనీలో ఉండే మహేందర్ యాదవ్కు(40) ఇద్దరు భార్యలు. 15 ఏళ్ల క్రితం పద్మను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె సోదరి జ్యోతినీ పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురికీ కలిపి ఐదుగురు పిల్లలు. భార్యలు, పిల్లలతో కలసి అత్తారింట్లోనే ఉండేవాడు. తాగుడుకు బానిసైన మహేందర్ తరచూ భార్యలను వేధించడంతో పాటు అనుమానంతో కొట్టేవాడు.
ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోదామని భార్యలు ఎంత చెప్పినా వినేవాడుకాదు. ఇల్లు తనకే ఇచ్చేయాలని ఎప్పుడూ గొడవపడేవాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం సేవించి మహేందర్ ఇంట్లో వాళ్లతో గొడవ పడ్డాడు. అంతే కాకుండా ఆదివారం తెల్లవారుజామునే అతని పెద్ద కొడుకును కొట్టడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతని భార్యలు మహేందర్ మెడకు చున్నీతో ఉరి బిగించి చంపేశారు. భర్త మృతి చెందాడో? లేదో? అన్న అనుమానం వచ్చిన పద్మ, జ్యోతి.. అతని మృతదేహన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు. బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, జగద్గిరిగుట్ట సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా తండ్రి చనిపోవడం.. తల్లులు అరెస్టు కావడంతో వీరి పిల్లలు అనాథలుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment