దొంగలను బయటకు నెడుతున్న తండ్రీ, కూతుళ్లు
సాక్షి, బెంగుళూరు: నగరంలోని ఓ నగల దుకాణంలో ఓ ముఠా దోపిడీకి యత్నించడంతో కలకలం రేగింది. అయితే ఆ నగల వ్యాపారి కూతుళ్లిద్దరూ ధైర్యంగా వారికి ఎదురు తిరగడంతో ఆరుగురు సభ్యుల ఆ దొంగల ముఠా తోక ముడిచింది. ఈ ఘటన దక్షిణ బెంగుళూరులో రెండు వారాల క్రితం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
జయానగర్‌లోని అశోక్ పిల్లర్ సమీపంలో రఘు(62) అనే వ్యక్తికి నగల కొట్టు ఉంది. మే 21(సోమవారం) రాత్రి 8 గంటల ప్రాంతంలో హెల్మెట్ ధరించిన ఓ ఆగంతకుడు నెక్లెస్ చూపించమని షాప్‌లో దూరాడు. అతని మాటలు నమ్మి రఘు షోకేస్ నుంచి నెక్లెస్ బయటకు తీయగానే మిగతా నగలన్నీ బయటపెట్టాలంటూ ఆ దొంగ కత్తి చూపించి బెదిరించాడు. ఏం జరుగుతుందో తెలియక అతను నిశ్చేష్టుడయ్యాడు.
అదే సమయంలో బయట కాపలాగా ఉన్న మిగతా అయిదుగురు దొంగలు కుడా లోపలికి ప్రవేశించడంతో రఘు సహాయం కోసం కేకలు వేశాడు. అక్కడే ఉన్న అతని కూతుళ్లిద్దరూ వెంటనే స్పందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకుని ధైర్యంగా వారిని ప్రతిఘటించారు. తండ్రీ, కూతుళ్లు ఆ దొంగల ముఠాను బయటకు నెట్టారు. రద్దీ ప్రాంతం కావడంతో దొరికిపోతామనే భయంతో దుండగులు అక్కడ నుంచి జారుకున్నారు.
కేసు నమోదు చేశామనీ, దుకాణంలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దుండగులు హెల్మెట్ ధరించడంతో దర్యాప్తు కొంత ఆలస్యమవ్వొచ్చని అన్నారు. దోపిడీ యత్నం జరిగిన విధానాన్ని బట్టి వారు ప్రొఫెషనల్ దొంగలు కాకపోవచ్చని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment