ముంబై: భారత అధికారులకు గత 15 ఏళ్లుగా దొరక్కుండా తిరుగుతున్న మాఫియా డాన్ రవి పుజారి ఎట్టకేలకు దొరికాడు. ఆఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డకార్‌లో పోలీసులు పుజారీని జనవరి 22న అరెస్ట్ చేశారు. ఈ విషయమై ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుజారీ అనుచరులు విజయ్ రోడ్రిక్స్, ఆకాశ్ శెట్టిలను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వీరిని విచారించగా, పుజారీ సెనెగల్‌లో తలదాచుకుంటున్నట్లు తేలిందన్నారు. బిల్డర్లు, సినీ ప్రముఖులను డబ్బుల కోసం ఈ గ్యాంగ్ బెదిరిస్తుందన్నారు. పుజారీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కర్ణాటకకు చెందిన పుజారీపై డజనుకుపైగా హత్య, బెదిరింపుల కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంతగ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment