
గాయంతో ఉన్న రాజు
తలకొండపల్లి: గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. మండల పరిధిలోని నల్లమెట్టు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ బీఎస్‌ఎస్ వరప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఫరూక్‌నగర్ మండలం వెంకన్నగూడ పంచాయతీకి చెందిన కొడావత్ రాజు రెండేళ్ల క్రితం బదుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పని చేసుకుంటూ భార్యాపిల్లలతో జీవనం సాగించాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ తెరుచుకోకపోవడంతో మూడు నెలలుగా మేస్త్రీ పనికి వెళ్తున్నాడు.
ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 9 గంటలకు నల్లమెట్టు అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై పడిఉన్నాడు. గొంతుపై గాయంతో అవస్థ పడుతున్న రాజును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని, రాజుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న బాధితుడు చేతులతో సైగల ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేశాడు. రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మైరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టుతున్నట్లు స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment