అడవిలో పడి ఉన్న మృతదేహం
వర్గల్(గజ్వేల్): ఎక్కడో హతమార్చారు..గుర్తుపట్టరాకుండా ముఖం చెక్కేశారు.. కనుగుడ్లు పీకేశారు.. ఈ దారుణానికి ఒడిగట్టిన గుర్తుతెలియని ఆగంతకులు వ్యక్తి మృతదేహాన్ని వర్గల్ మండలం మీనాజీపేట రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలోని కాలువలో పడేసి వెళ్లి పోయారు. కలకలం రేపిన ఈ సంఘటన వర్గల్ మండలం మీనాజీపేట అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం సందర్శించారు. డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ శివలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 30–35 సంవత్సరాల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తిని ఎక్కడో హతమార్చారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ముఖాన్ని చెక్కేశారు. కనుగుడ్లను పీకేశారు. మీనాజీపేట గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన బంధం చెడావు అటవీ ప్రాంతం వద్ద కాలువలో మృతదేహాన్ని పడేసిపోయారు. గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి గౌరారం పోలీసులకు సమాచారం చేరవేశారు.
రంగంలోకి డాగ్ స్క్వాడ్
మీనాజీపేట అడవిలో బోర్లాపడి ఉన్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టరాకుండా ముఖం చెక్కేసి ఉండడంతో క్లూస్ టీమ్‌ను, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. వారు అక్కడ పలు ఆధారాలు సేకరించారు. అనంతరం గ్రామ వీఆర్వో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
మీనాజీపేట అడవిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించి హతుడెవరు, హంతకులెవరో తేల్చేందుకు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం తెలిపారు. మృతుడు 30–35 సంవత్సరాల మధ్య వయస్కుడని, బూడిద రంగు ప్యాంటు, అదే రంగు టీషర్టు ధరించి ఉన్నాడని వివరించారు. చేతికి ఇత్తడి కడియం, మెడలో రోల్డ్‌గోల్డ్ గొలుసు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని గజ్వేల్ ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో బుధవారం వరకు భద్రపరుస్తామని, ఆనవాళ్లు తెలిసిన వారు గజ్వేల్ రూరల్ సీఐ సెల్ నంబర్ 94906 17022 లేదా గౌరారం ఎస్సై సెల్ నంబర్ 94409 01839కు సమాచారమివ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment