మీడియాతో మాట్లాడుతూ రోదిస్తున్న బాధితురాలు
లక్నో : దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రెండు అత్యాచార ఉదంతాల్లో ఉన్నావ్ ఘటన ఒకటి. 17 ఏళ్ల యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన యూపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. తీవ్ర విమర్శల నేపథ్యంలో కాస్త తగ్గిన యోగి సర్కార్.. కేంద్రానికి విజ్ఞప్తి చేయటంతో సీబీఐ రంగంలోకి దిగి కుల్దీప్‌ను అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే బాధితురాలు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరిగిన దారుణం గురించి వెల్లడించింది. మక్కీ గ్రామంలో ఎమ్మెల్యే ఇంటి పక్కనే బాధిత యువతి ఇళ్లు ఉండేది. యువతి కుల్దీప్‌ను అన్నయ్య అని పిలిచేది. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెను తన ఇంటికి రప్పించి మరీ కుల్దీప్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి మాట్లల్లోనే.. ‘మా పెదనాన్న కుల్దీప్ భయ్యా వెంట తిరుగుతూ ఉండేవారు. మాది పేద కుటుంబం. ఆయన తరచూ మా ఇంటికి వస్తూ ఉండేవాడు. ఉద్యోగం కోసం సాయం చేయాలని ఆయన్ని మా నాన్న కోరాడు. ఈ క్రమంలో జూన్ 4న(2017) నన్ను రావాలంటూ కుల్దీప్ భయ్యా పిలిచారు. ఓ వ్యక్తి వచ్చి నన్ను పక్కనే ఉన్న గదిలో కూర్చొమన్నారు. ఇంతలో కుల్దీప్ వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నాపై పడి నన్ను బలాత్కారం చేయబోయారు. వద్దని వేడుకున్నా వినిపించుకోలేదు. విషయం ఎవరికైనా చెబితే నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. భయంతో నేను ఎవరికీ చెప్పలేదు. వారం తర్వాత కొంత మంది మా ఇంటికి వచ్చి మరీ నన్ను లాక్కెల్లారు. కొన్ని రోజులపాటు అంతా కలిసి నాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకి ఓ వ్యక్తికి నన్ను అమ్మేయగా.. పోలీసులు నన్ను రక్షించి చెర నుంచి విడిపించారు.
.. కుల్దీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవటంతో నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటానికి వెళ్లాం. ఆగష్టు 17న నేను, నా మావయ్య సీఎం యోగిని ఆయన ఇంట్లో కలిశాం. ఆ సమయంలో ఆయన నాకు ధైర్యం చెప్పి.. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కానీ, ఎలాంటి లాభం లేకపోయింది. ఇప్పుడు తిరిగి ఊరికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. నా తండ్రిని కోల్పోయాను. వాడు(కుల్దీప్‌ను ఉద్దేశించి) మాత్రం దర్జాగా నవ్వుతున్నాడు. నా ప్రాణాలు పోయినా సరే న్యాయ పోరాటం కొనసాగుతుంది’ అని యువతి పేర్కొంది. కాగా, 11 ఏళ్ల బాధితురాలి సోదరి తమ కళ్ల ఎదుట తండ్రిని కొందరు దుండగులు ఎలా హింసించారో మీడియాకు చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులను అధికారులు లక్నోలో ఓ హోటల్‌లో ఉంచి భద్రత కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment