వడోదర : మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేరీతిలో ఓ వీడియోను తన యూట్యూబ్ పేజీలో పోస్టుచేసిన వ్యక్తిని వడోదర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి ఈద్ వేడుకలు, మహారాణా ప్రతాప్ జయంతి ర్యాలీ సందర్భంగా వడోదర నగరంలోని ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో మయూర్ కదం (30) వ్యక్తి తన యూట్యూబ్ పేజీ ‘ధరమ్ యోధ’లో ఓ వీడియోను పోస్టు చేశాడు. మహారాణా ప్రతాప్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలను పెట్టి.. ఈ వీడియోను రూపొందించాడు. ఈ వీడియో పోస్టు చేసిన ఒక్కరోజులోనే 2500 లైకులు వచ్చాయి. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉండటంతో సైబర్ సెల్ పోలీసులు ఈ వీడియోను ఒక్కరోజులోనే యూట్యూబ్‌లోంచి తొలగించారు. మయూర్ కదం తన నేరాన్ని ఒప్పుకున్నాడని, ప్రజలను వీడియో ద్వారా చైతన్యపరచాలని ఆ వీడియోను పోస్టుచేసినట్టు అంగీకరించడాని వడోదర జాయింట్ కమిషనర్ కేజీ భటీ తెలిపారు. నగరంలో ఏ చిన్న మతపరమైన ఉద్రిక్తత చోటుచేసుకున్నా.. మతఘర్షణలు రెచ్చగొట్టే ఉద్దేశంతో కొందరు దుండగులు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, దీనిపట్ల అప్రమత్తంగా ఉంటూ.. ఈ చర్యలను నియంత్రిస్తున్నామని ఆయన తెలిపారు. మయూర్‌ను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment