![Victims Family Alleges Son In Law Killed Their Daughter Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/15/fire-in-woman.jpg.webp?itok=taAXOKm-)
సాక్షి, కృష్ణా : కట్టుకొన్నవాడే ఆ ఇల్లాలి పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతం కావటంతో మృగాడిగా మారాడు .అగ్నిసాక్షిగా తాళి కట్టిన చేతులతోనే భార్యపై పెట్రోలు పోసి సజీవదహనం చేశాడు. గర్భవతి అనే కనికరం కూడా లేకుండా పాశవికంగా హతమార్చాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..కృష్ణా జిల్లా అవనిగడ్డ లింగారెడ్డి పాలెంకు చెందిన శైలజకు.. గుడివాడ జొన్నపాడుకు చెందిన నంబియార్‌తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అల్లుడు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివి, కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండటంతో శైలజ తల్లిదండ్రులు.. అతడు అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు.
ఈ క్రమంలో నూతన దంపతులు విజయవాడ కృష్ణలంకలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. భర్తకు ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాలనే ఉద్దేశంతో శైలజ ఉద్యోగం చేసేందుకు సిద్ధపడింది. భర్తను ఒప్పించి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజుల వరకు సజావుగానే వీరి సంసారంలో అనుమాన భూతం ప్రవేశించింది. భర్త నంబియార్ ప్రవర్తనలో మార్పు రావడంతో శైలజను కష్టాలు చుట్టుముట్టాయి. అనుమానానికి తోడు వరకట్న పిశాచి ఆవహించినట్టు నంబియార్.. అదనపు కట్నం కోసం శైలజను తీవ్రంగా వేధించేవాడు. సూటిపోటి మాటలతో కుళ్ళబొడుస్తూ.. చిత్రవధ చేసేవాడు. ఈ క్రమంలో వేధింపులు శృతిమించటంతో శైలజ తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడేది. ఈ నేపథ్యంలోనే శనివారం ఒళ్లు కాలుతూ ఆర్తనాదాలు పెట్టిన శైలజను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శైలజ మృత్యు ఒడికి చేరింది. కాగా బావ నంబియారే తన చెల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడని శైలజ అన్న ప్రసాద్ ఆరోపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment