
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఉదంతంపై యావత్ మహిళాలోకం సోషల్ మీడియా వేదికగానే పోరాటం చేయాలని టీపీసీసీ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై షర్మిల పడుతున్న ఆవేదన.. సమాజంలో మహిళల దుస్థితికి అద్దం పడుతుందన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలపై విషం కక్కుతున్న ఈ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరముందని బుధవారం ఓ ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు.
రాజకీయాల్లో మహిళలను అణగదొక్కుతూ, వేధింపులకు గురిచేస్తూ.. పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయన్నారు. ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా మరింత కుంగదీస్తాయన్నారు. షర్మిలకు న్యాయం జరిగే విషయంలో పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని.. 40 ఏళ్లుగా.. సినిమా, రాజకీయ రంగాల్లో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తన స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానని ఆ ప్రకటనలో ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment