సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా.. ప్రజలకు సేవలు అందాలన్నా జిల్లాలో పంచాయతీ వ్యవస్థే కీలకం. పంచాయతీ వ్యవస్థలో ఉన్నతాధికారుల వద్ద నుండి కిందిస్థాయి అధికారుల వరకూ మామూళ్ల మత్తులో ఊగుతున్నారు. వారు అడిగిన మేరకు మామూళ్లు ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తున్నారు. జిల్లాలో 909 పంచాయతీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలకు జిల్లా పంచాయతీ వ్యవస్థ సేవలందిస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా జిల్లాలోనూ బదిలీలు జరిగాయి. జిల్లా పంచాయతీ విభాగంలో నిర్వహించిన బదిలీ విషయంలో లక్షల్లో చేతులు మారినట్లు తెలుస్తోంది.
కీలకమైన మేజర్ పంచాయతీల్లో పోస్టింగ్ కావాలంటే కీలక అధికారికి లక్షల్లో ముట్టచెబితేనే పోస్టింగ్‌లు వేసినట్లు సమాచారం. అంతే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదన లేఖలు ఉన్నప్పటికీ సదరు ఉన్నతాధికారికి సొమ్ములు ముట్టచెపితేనే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా గ్రేడ్ 1 పంచాయతీలో కార్యదర్శులకు పోస్టింగ్ కావాలంటే ఒక రేటు, గ్రేడ్ 2 పంచాయతీలో పోస్టింగ్ కావాలంటే మరో రేటు ఇలా ఆయా పంచాయతీల స్థాయిని బట్టి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
పదోన్నతుల్లోనూ వసూళ్లు
సాధారణ బదిలీలకంటే ముందుగా జిల్లా పంచాయతీలో బదిలీల ప్రక్రియను నిర్వహించారు. ఈ పదోన్నతుల్లో భాగంగా సుమారు 30మందికి పైగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లోనూ భారీ గానే చేతులు మారినట్లు తెలుస్తుంది. పదోన్నతులను బట్టి రూ.20వేల నుండి రూ.50వేల వరకూ ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. అదే విధంగా ఆపరేటర్ల పోస్టుల భర్తీలోనూ ఒక్కొక్కరి నుండి రూ.6వేల నుండి రూ.10వేల వరకూ సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
సొమ్ములు ఇవ్వకుంటే వేధింపులు
డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకూ జిల్లాలో వారి పరిధిలోని పంచాయతీలకు తనిఖీలకు వెళుతుంటారు. ఈ తనిఖీలకు అధికారులు నిర్ణయించిన మేరకు కార్యదర్శులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా అధికారులు నిర్దేశించిన మొత్తాల్లో చెల్లించకుంటే సంబం ధిత కార్యదర్శులపై వేధింపులు తప్పవు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీలో వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట వేయకుంటే జిల్లా పంచాయతీ వ్యవస్థ అవినీతి రొంపిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment