మృతిచెందిన బాలుడు
సాక్షి, చెన్నై: తమిళనాడులో అమానుషం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ చోరీచేశాడన్న అనుమానంతో ఓ బాలుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. కరూర్‌జిల్లా జగదాబి అల్లాలి గౌండనూర్ గ్రామానికి చెందిన ఇలంజియం కుమారుడు బాలసుబ్రమణి(15) బడికి వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ వచ్చాడు. శనివారం రాత్రి ఆ ప్రాంతానికి చెందిన టైలర్ మునుస్వామి తన సెల్‌ఫోన్ కనిపించడం లేదంటూ బాల సుబ్రమణిని నిలదీశాడు. తాను తీయలేదని వారించినా మునుస్వామి ఖాతరు చేయలేదు. మునుస్వామితో పాటు ఆ గ్రామానికి చెందిన పలువురు బాల సుబ్రమణిని స్తంభానికి కట్టిపడేసి చితక్కొట్టారు. స్పృహ తప్పడంతో అలాగే వదలి వెళ్లిపోయారు.
ఆదివారం ఉదయాన్నే బాల సుబ్రమణిని మళ్లీ ప్రశ్నించేందుకు అక్కడికి వచ్చారు. అయితే, రాత్రి కొట్టిన దెబ్బలకు రక్తస్త్రావం అధికంగా కావడంతో రాత్రంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడి బాలుడు మరణించాడు. సమాచారం అందుకున్న కరూర్ పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితులు మునుస్వామి, పరమ శివం, సెల్వకుమార్, మణివేల్, మునియప్పన్‌లను అరెస్టు చేశారు. బాలుడ్ని చితక్కొడుతుంటే వేడుకలా చూస్తుండిపోయిన పలువురు గ్రామస్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుల భయంతో కొందరు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment