
కశింకోట ఆర్‌ఐ కార్యాలయంలో వీఆర్వోను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు,ఏసీబీ అధికారులకు పట్టుబడిన కన్నూరుపాలెం వీఆర్వో రామఅప్పారావు
కశింకోట(అనకాపల్లి):అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో కన్నూరుపాలెం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చిక్కాడు. పట్టాదారు పాసు పుస్తకం మంజూరు కోసం గురువారం రూ.9 వేలు లంచం తీసుకుని దొరికి పోయాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రామకృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఈ.చౌడువాడ (కన్నూరుపాలెం), సుందరయ్యపేట గ్రామ పంచాయతీలకు జి.రామఅప్పారావు వీఆర్వోగా పని చేస్తున్నాడు. కన్నూరుపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ వర్మ, మరో ఇద్దరు కలిసి అక్కడ ఎకరం 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. దానికి ఈ–పాసు పుస్తకం, టైటిల్ డీడ్ కోసం మీ–సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసి, వీఆర్వో రామఅప్పారావును సంప్రదించారు. పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే రూ.పది వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.లంచం ఇవ్వలేదని చాలా రోజులుగా తిప్పించుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో రూ.9 వేలు ఇవ్వడానికి శ్రీనివాస్‌ప్రసాద్‌వర్మ అంగీకారం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఈ నెల 20న ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.9 వేలను వీఆర్వోకు గురువారం వర్మ అందజేశారు. అనంతరం ఏసీబీ అధికారులకు ఆ సమాచారం అందజేశారు. దీంతో ఏసీబీ అధికారులు వీఆర్వోకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వో కోసం వాకబు చేశారు. ఇక్కడ లేరని బదులివ్వడంతో తహసీల్దార్ కార్యాలయ డఫెదార్ నాగేశ్వరరావు సెల్ ద్వారా వీఆర్వోకు ఫోన్ చేశారు. దీంతో ఎక్కడ ఉన్నది సమాచారం ఇవ్వడంతో బయ్యవరం హెరిటేజ్ పార్లర్ సమీపంలో ఉన్న వీఆర్వోను పట్టుకున్నారు. అతని పరసలో ఉన్న రూ.9 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. వీఆర్వోను అరెస్టు చేశామని, ఉన్నతాధికారుల నుంచి ప్రొసిడింగ్స్ వచ్చాక శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ దాడిలో సీఐలు గణేష్,ప్రసాద్, రమణమూర్తి, గపూర్,మహేశ్వరరావు పాల్గొన్నారు. ఏసీబీ వలకు వీఆర్వో చిక్కడంతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment