
సాక్షి, నాగర్‌కర్నూల్: సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి నాగర్‌కర్నూల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా.. రాజేశ్‌ను జైలుకు తరలించారు. కాగా, స్వాతి, రాజేశ్‌లకు బెయిల్ కోసం తాము ప్రయత్నించబోమని ఇరు కుటుం బాలు ప్రకటించాయి. కట్టుకున్నోడిని హతమార్చి.. అటు కన్నవారికి తలవంపులు తెచ్చిన స్వాతికి మరణశిక్ష పడాలని సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్వాతి తల్లిదండ్రులు కూడా బెయిల్ కోసం తాము ప్రయత్నించమని తేల్చి చెప్పారు.
ఇదిలాఉండగా.. సుధాకర్‌రెడ్డి తల్లికి స్వాతి తండ్రి సొంత సోదరుడు. మేనమామ కూతురినే సుధాకర్‌రెడ్డి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య మొన్నటి వరకు సత్సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం అవి పటాపంచలయ్యాయి. సుధాకర్, స్వాతి పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. వారిని తీసుకుపోయేందుకు సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించకపోగా.. తమ కుమారుడి వయసు వచ్చాక మనవడిని తీసుకువెళ్తామని వారు చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు రాజేశ్‌ను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. స్వాతి ప్రోద్బలంతోనే సుధాకర్‌రెడ్డిని హత్య చేశారని చెప్పారు. మూడు నెలల క్రితమే సుధాకర్ రెడ్డిపై స్వాతి హత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు.
స్వాతి కోసమే కాల్చుకున్నా..
స్వాతితో కలసి బతికేందుకే తన ముఖంపై పెట్రోల్ వేసుకుని కాల్చుకున్నానని, ఇది ఎంతో కష్టమైనా ఆమె కోసం భరించానని రాజేశ్ చెప్పుకొచ్చాడు. సుధాకర్‌తో శత్రుత్వం లేదని.. స్వాతి కోసమే అతడిని హత్య చేసేందుకు అంగీకరించినట్లు చెప్పాడు. ఎంత ఖర్చయినా తనకు బాగుచేయిస్తానని స్వాతి చెప్పిందని, పిల్లలను తమతోనే ఉంచుకుని మిగతా జీవితాన్ని ఎక్కడికైనా దూరంగా వెళ్లి గడపాలని భావించినట్లు వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment