నగరానికి చెందిన ఓ యువతిని ఉద్దేశించి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆవాట్సాప్ ఖాతా పని చేస్తున్న ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దీంతో దర్యాప్తునకు అవసరమైన ఆధారాల కోసం పోలీసులు వాట్సాప్ సంస్థకు ఈ–మెయిల్ పెట్టారు. దాదాపు నెల రోజులుగా ‘ఉత్తర–ప్రత్యుత్తరాలు’ మినహా సదరు సంస్థ ఆధారాలు పంపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో:కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు పలు వాట్సాప్ ఆధారిత కేసుల దర్యాప్తులో పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు సోషల్‌మీడియా ద్వారా బాధితులకు వేధింపులు ఎదుర్కొంటుండగా... ఆ సంస్థ లీగల్ టీమ్ నుంచి పోలీసులూ అవస్థలు పడుతున్నారు. ఈ వ్యవహారంలో తాము ఏమీ చేయలేమని, కేంద్రం హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) స్థాయిలో ఓ పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
గణనీయంగా పెరిగిన వినియోగం...
సోషల్‌మీడియాలో ఫేస్‌బుక్ తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం వాట్సాప్‌కు మాత్రమే ఉంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపు వాట్సాప్‌ను వాడుతున్నట్లే లెక్క. అయితే దీని వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అదే స్థాయిలో సమస్యలూ ఎదురవుతున్నాయి. పలువురు వ్యక్తులు తాము టార్గెట్ చేసిన వ్యక్తిని వేధిస్తూ దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న కొందరు కేటుగాళ్లు తమ ఫోన్ నంబర్ కాకుండా సుదూర ప్రాంతంలో ఉన్న మరో నంబర్ ఆధారంగా తమ ఫోన్ నుంచే వాట్సాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ హ్యాకింగ్ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించి పోలీసులకు వస్తున్న ఫిర్యాదుల విచారణ, వారు నమోదు చేస్తున్న కేసుల దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే వాట్సాప్ సంస్థ నుంచి సాంకేతిక సహకారం, సమాచారం అనివార్యం. అయితే ఇక్కడే పోలీసులకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. విచారణ/దర్యాప్తునకు అవసరమైన సమాచారం అందించాల్సిందిగా పోలీసులు పంపిస్తున్న ఈ–మెయిల్స్‌పై వాట్సాప్ సంస్థ లీగల్ టీమ్ అవసరమైన స్థాయిలో స్పందించడం లేదు. కొన్నిసార్లు కావాల్సిన సమాచారంపై స్పష్టత కావాలని, మరి కొన్నిసార్లు ఆ వివరాలు అందించలేమని, ఇంకొన్ని సార్లు ఆ సమాచారం తమ వద్ద లేదంటూ ‘జాబులు–జవాబులతో’ కాలం వెళ్లదీస్తోంది. దీంతో తమను ఇబ్బంది పెడుతున్న వారి వివరాలు తెలియక, పోలీసులకూ వారు చిక్కక బాధితులకు వేధింపులు కొనసాగి వారు మనోవేదనకు గురవుతున్నారు.
తప్పనిసరి అయినా...
సైబర్ నేరాలకు సంబంధించిన కేసులో ఆయా ఆధారాలను కొన్నిసార్లు వ్యక్తులతో పాటు సోషల్‌మీడియా సంస్థల నుంచీ సేకరించాల్సి ఉంటుంది. బాధితులు, నిందితులతో పాటు జీమెయిల్, ఫేస్‌బుక్ వంటి సంస్థల నుంచి వీటిని సంగ్రహించడంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోయినా వాట్సాప్ విషయంలోనే అవస్థలు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు కోరినా వారు స్పందించకపోవడం, ఎట్టకేలకు స్పందించినప్పటికీ సమగ్ర సమాచారం ఇవ్వడం లేదన్నారు. దీంతో అనేక కేసులు కొలిక్కిరాకుండా, కొన్ని పూర్తిస్థాయి అభియోగపత్రాలు దాఖలుకు నోచుకోకుండా పెండింగ్‌లో పడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని అధీకృత అధికారికి, నిర్ణీత కాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఆయా వ్యక్తులు, సంస్థలపై ఉంటుంది. ఐపీసీలోని సెక్షన్ 188 సెక్షన్ దీనిని స్పష్టం చేస్తోంది. ఎవరైనా లేదా ఏ సంస్థ అయినా ఆధారాలు అందించకపోతే ఈ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణించి తదుపరి చర్యలు తీసుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాట్సాప్ వంటి అంతర్జాతీయ సంస్థలతో స్థానిక పోలీసులు పోరాడ లేరని, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమని వారు పేర్కొన్నారు. కేవలం ఈ–మెయిల్ సంప్రదింపుల మినహా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల కార్యాలయాలు సైతం ఎక్కడ ఉన్నాయనేది పోలీసులకు తెలియట్లేదు. వాట్సాప్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ సొంతం చేసుకుని నిర్వహిస్తున్నా సమాచారం, ఆధారాలు పొందటంలో ఇబ్బందులు తప్పట్లేదని దర్యాప్తు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment