సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి కేసులో ఏసీబీ ఆయన బినామీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆయనకు బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పటివరకు ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు భూములకు చెందిన డాక్యుమెంట్లు, మూసాపేట, అమీర్‌పేట, సోమాజీగూడల్లోని కమర్షియల్ కాంప్లెక్స్‌ల పత్రాలను స్వాధీనం చేసుకుంది. అలాగే అల్లుడు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పురుషోత్తంరెడ్డి రూ. 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.
ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది...కాంప్లెక్స్‌లను ఎప్పుడు, ఎవరి నుంచి కొన్నారు...వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు...నిషాంత్‌రెడ్డి బినామీగా నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలోకే డబ్బు రావడం వెనకున్న ఆంతర్యం ఏమిటి అనే అంశాలపై ఏసీబీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కూతురుకు రూ. 3.2 కోట్ల విలువైన ఓ భవనం గిఫ్ట్ డీడ్‌గా చేసిన విషయాలపైనా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధాన బినామీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారాలు, అందులో పురుషోత్తంరెడ్డి పెట్టిన పెట్టుబడులు, ఇతర ఆదాయ వ్యవహారాలపై యాదవరెడ్డితోపాటు నిషాంత్‌రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటివరకు బయటపడ్డ ఆస్తుల్లో బినామీలుగా వ్యవహరిస్తున్న వారి వాటా? బినామీలు చేస్తున్న వ్యాపారాల్లో పురుషోత్తంరెడ్డి వాటా ఎంత అన్న అంశాలను ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది.
మిగతా ఆస్తులపైనా...
ఇప్పటివరకు రూ. 45 కోట్ల వరకు ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మిగతా ఆస్తులపైనా యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ పురుషోత్తంరెడ్డి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వారి నుంచి ఏసీబీ స్పష్టత తీసుకున్నట్లు తెలియవచ్చింది. కుమార్తె వివాహం సందర్భంగా కొన్న వజ్రాభరణాలకు డబ్బు ఎక్కడిదిన్న అంశాలపై పదే పదే ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడికి, పురుషోత్తంరెడ్డికి ఉన్న లింకులేంటి... వాటి వెనకేమైనా ఆర్థిక లావాదేవీలున్నాయా అనే అంశాలపైనా లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పురుషోత్తంరెడ్డి బినామీ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో సోమవారం ఏసీబీ సోదాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొందిన ఏసీబీ సోదాలు నిర్వహించి మరిన్ని కీలక ఆస్తుల వివరాలు సంపాదించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ఆస్తుల వెనుక ఎందరు?
Published Mon, Feb 19 2018 2:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment