
సాక్షి, హైదరాబాద్ : వాట్సాప్ కాల్ చేసి భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. తమ వివాహబంధం నేటితో ముగిసిపోయిందంటూ ఫోన్ పెట్టేశాడు. నివ్వెరపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. వివరాలు.. యూసుఫ్ గూడకు చెందిన సమియాభానుకు టోలిచౌకికి చెందిన మహ్మద్ మెజిమిల్ షరీఫ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఓ పాప జన్మించిన తర్వాత కలతలు మొదలయ్యాయి. సమియాను వదిలించుకుని షరీఫ్ మరో పెళ్లి చేసుకోవాలన్నాడు. నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
టోలిచౌకిలోని ఎం.డి.లైన్స్‌లో గల జెమ్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్‌గా పనిచేసే షరీఫ్ నుంచి సమియాకు ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. భర్త మనస్సు మారిందని భావించిన ఈ ఇల్లాలు సంబరపడిపోతూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. అంతలోనే పిడుగులాంటి వార్త. ‘ఇక నుంచి నీకు, నాకు ఏ సంబంధం లేదు.. తలాఖ్, తలాఖ్, తలాఖ్’ అంటూ షరీఫ్ ఫోన్ పెట్టేశాడు. ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు దర్నాకు దిగింది. భర్త పనిచేసే పాఠశాల ఎదుట కూడా సమియా ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు షరీఫ్. తనలా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా కాపాడాలని సమియా కోరుతోంది. చట్టరిత్యా ట్రిబుల్ తలాక్ చెల్లదని.. అతనిపై వరకట్న వేధింపులకు సంబంధించి ఐపీసీ 498 ఏ, 406, 506, డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. షరీఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment