యువరాజు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న విడదల రజని
సాక్షి, యడ్లపాడు (చిలకలూరిపేట): యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం(పుట్టకోట) గ్రామానికి చెందిన కాకాని బ్రహ్మయ్య, రమాదేవి (30) దంపతులు. వారికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి చాలాకాలం సంతానం కలుగలేదు. ఐదేళ్ల క్రితం కుమారుడు బాలమణికంఠ, 11 నెలల క్రితం కుమార్తె యశస్విని జన్మించారు. పిల్లలిద్దరినీ తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీన రమాదేవి పుట్టిళ్లయిన కొదమగుంట్లలో వెంకటేశ్వరస్వామి గుడి ప్రతిష్టకు భార్య, పిల్లలను బ్రహ్మయ్య తన బైక్‌పై ముందురోజు తీసుకెళ్లి దిగబెట్టి వచ్చాడు. పొలం పనులు చూసుకొని శనివారం తిరిగి బైక్‌పై అత్తగారింటికి వెళ్లి, రెండు రోజులు అక్కడే ఉండి సోమవారం ఉదయం స్వగ్రామానికి బైక్‌పై తిరుగుప్రయాణం కట్టారు. (గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం)
సాతులూరు వద్దకు చేరుకోగానే వర్షం మొదలవడంతో భార్యా పిల్లలు తడిచి పోతారని భావించిన బ్రహ్మయ్య సాతులూరు జంక్షన్‌లో ముగ్గురిని ప్యాసింజెర్ ఆటో ఎక్కించి, ఆ వెనుకే తనూ బయలుదేరాడు. ఒడిలో కుమార్తెను, పక్కన కుమారుడిని కూర్చోబెట్టి ఆటో వెనుకే వస్తున్న భర్తను రమాదేవి గమనిస్తూనే ఉంది. ఆటో బయలుదేరి 15 నిమిషాలు గడిచాయో లేదో ట్రాలీ ఆటో ఎదురుగా వచ్చి ఢీకొంది. అంతే బ్రహ్మయ్యకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లయింది. ఒక్క ఉదుటున ఆటోవద్దకు చేరుకున్నాడు. ఒకవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన భార్య.. తల్లి పొత్తిళ్లలోనే ప్రాణం వదిలిన కుమార్తె.. గాయాలను తట్టుకోలేక నాన్నా అంటూ తల్లడిల్లుతున్న కుమారుడు.. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో తెలియక.. మొద్దుబారిన మెదడుతో గుండెలు బాదుకుంటూ భోరుమన్నాడు. బ్రహ్మయ్య తండ్రి లక్ష్మీ నారాయణకు రెండేళ్ల క్రిందట పక్షవాతం బారిన పడ్డాడు. ఏడాది కిందట మామయ్య వెంకటరామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. భార్యాబిడ్డలు దూరం కావడంతో బ్రహ్మయ్యను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు.
రమాదేవి, బాలమణికంఠ, యశస్విని మృతితో కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.సాయంత్రం 5 గంటల సమయంలో నరసరావుపేట ఆసుపత్రి నుంచి రమాదేవి, చిన్నారి యశస్విని మృతదేహాలను కొత్తపాలెం గ్రామానికి తీసుకువచ్చారు. 7 గంటలకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలమణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి గ్రామానికి తరలించారు. మృతదేహాలను చూసిన కుటుంబసభ్యుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి.
ఎమ్మెల్యే రజని పరామర్శ
నాదెండ్ల (చిలకలూరిపేట): రేపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సాతులూరుకు చెందిన అశోక్ కుమార్, చందవరం వాసి ఆవుల యువరాజ్ మృతదేహాలను ఎమ్మెల్యే విడదల రజని సోమవారం రాత్రి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు పరామర్శించారు.
కలచివేసింది : ఎమ్మెల్యే శ్రీదేవి
పేరేచర్ల (తాడికొండ): రేపూడి రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రేçపూడి రోడ్డు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు చిన్నారులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment