నిందితురాలు వీరలక్ష్మి(ముసుగుతో ఉన్న మహిళ) తో సీఐ విజయ్‌నాథ్
యలమంచిలి:తన ఫోన్ నంబర్ కాకుండా తల్లి ఫోన్ నంబర్ ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసులో నిందితురాలిని పట్టుకున్నారు. సీఐ కె.వి.విజయనాథ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పాతవీధిలో నివాసం ఉంటున్న అతికిన శెట్టి నాగేశ్వరావు అనే ఉల్లిపాయల వ్యాపారి ఈనెల 7వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు అతికినశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య వీరలక్ష్మి ఫోన్ నంబర్‌ను పోలీసులు తీసుకున్నారు. అయితే ఆమె తన ఫోన్ నంబర్ కాకుండా తన తల్లి ఫోన్ నంబర్ ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె వినియోగిస్తున్న ఫోన్ నంబర్ తీసుకుని కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. భార్యే నిందితులురాలని నిర్ధారించుకుని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. తానే తన భర్తను చంపినట్టుగా వీరలక్ష్మి అంగీకరించినట్టు సీఐ తెలిపారు.
హత్యకు దారితీసిన పరిస్థితులు ..
నాగేశ్వరావు, అతని భార్య వీరలక్ష్మికి మధ్య మూడేళ్లుగా విభేదాలున్నాయి. తన భర్త వల్ల తనకు ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతోపాటు నిత్యం వేధిస్తుండేవాడని వీరలక్ష్మి పోలీసులకు తెలిపింది. తనకు గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తితో పరిచ యం ఉందని చెప్పింది. 7వ తేదీ రాత్రి రోజూలాగే తన భర్త తాగి ఇంటికి వచ్చాడని, అతనితో వాగ్వాదం జరగడంతో గట్టిగా నెట్టినట్టు ఆమె చెప్పింది. పడిపోవడంతో గాయాలు తగిలాయని తెలిపింది. అనంతరం మంచంపై పడుకున్న నాగేశ్వరావు గొంతుకు రెండు పేటలుగా చేసిన పురికోస తాడుతో బిగించానని, అప్పటికీ ప్రాణంతో ఉండడంతో ముక్కు,నోరుమూసి హత్యచేశానని నిందితురాలు పోలీసులకు తెలిపింది. ఈ హత్యతో ఎవరికీ సంబంధంలేదని తెలిపినట్టు సీఐ చెప్పారు. నిందితురాలిని కోర్టుకు హాజరపరుస్తామని ఆయన తెలిపారు.కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు.తల్లి అనారోగ్యంతో మంచంపై ఉండగా, ఇద్దరు పిల్లలు చాలా కాలంగా వారి అమ్మమ్మ వద్దే ఉంటూ చదువుకుంటున్నారు. ఈకేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తామని సీఐ కె.వి.విజయనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment