
హత్యకు ఉపయోగించిన క్రికెట్ బ్యాట్, రోకలి
చిత్తూరు,పలమనేరు: మండలంలోని మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారం భార్య, ఆమె తల్లి కలిసి క్రికెట్ బ్యాట్, రోకలితో కొట్టి భర్తను హత్య చేశారు. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి (36) కి అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత(32)తో కలిసి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గోపీనాథ్ రెడ్డి కొన్నాళ్ల క్రితం బెంగకూరు వెళ్లి అక్కడే సొంతంగా క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం కుటుంబంతోపాటు స్వగ్రామానికి వచ్చి అత్తాగారింట్లో ఉంటున్నారు.
డ్యూలు కట్టకపోవడంతో కారును ఫైనాన్స్ కంపెనీవారు ఇటీవల తీసుకెళ్లారు. దీంతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని గోపీనాథ్‌రెడ్డి భావించాడు. అందుకు నగలు ఇవ్వా లని భార్యను అడిగాడు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి గోపీనాథ్‌రెడ్డి నగల విషయంపై భార్య, అత్తతో గొడవపడ్డాడు. ఆగ్రహం చెందిన భార్య క్రికెట్ బ్యాట్, అత్త రోకలితో మద్యం మత్తులో ఉన్న అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో అతని మర్మాంగాలకు తీవ్రగాయాలయ్యాయి. పురుషాంగం కొంత తెగింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య చేసింది తామేనంటూ భార్య, అత్త పోలీసులకు తెలిపారు. మృతునికి తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు. సీఐ శ్రీధర్ కేసును విచారిస్తున్నారు. అందరితో కలిసిమెలసి ఉండే గోపీనాథ్‌రెడ్డి హత్య గ్రామంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment