సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ గురవయ్య, ఎస్‌ఐ రేణుకలు కాలి బుడిదైన భాగ్యలక్ష్మి
చేవెళ్ల: తన భార్య వేరే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే కక్షతో భార్యను, సదరు యువకుడిని ఇంట్లో రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వారిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. దీంతో భార్య మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందగా.. వివాహేతర సంబంధం పెట్టుకున్న యవకుడు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన చేవెళ్లలో ఆదివారం ఉదయం జరిగింది. చేవెళ్ల గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(30)కి దామరగిద్ద గ్రామానికి చెందిన రవితో పదేళ్ల క్రితం వివాహమైంది. రవి పెళ్లికి ముందే చేవెళ్లలో స్థిరపడ్డాడు. దీంతో వీరు చేవెళ్లలోనే ఉంటున్నారు. వీరికి పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.
కాగా, భాగ్యలక్ష్మి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలుసుకున్న రవి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మితో వివాహేతర సంబంధం పెటుకున్న వ్యక్తి శనివారం రాత్రి ఆమె దగ్గరకు వచ్చాడని, ఆదివారం ఉదయం కూడా ఇంట్లోనే ఉన్నట్లు తెలుసుకున్న రవి కోపంతో పెట్రోల్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో భాగ్యలక్ష్మి, ఆ యువకుడిని గుర్తించి బయట నుంచి గడియ పెట్టి అందులో పెట్రోల్ పోశాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులను బయటకు తీసుకెళ్లి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఇది గమనించిన పిల్లలు ఏడుస్తూ పక్క ఇంట్లో ఉండే పెద్దమ్మ లక్ష్మి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. దీంతో వారు వచ్చి పరిశీలించారు.
అప్పటికే ఇంట్లో నుంచి మంటలు రావటంతో చుట్టు పక్కల వారు సైతం వచ్చి మంటలను ఆర్పేదుకు ప్రయత్నించారు. వారున్న గదిని తెరవగా అందులో ఉన్న యువకుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీశాడు. అతన్ని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించగా వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భాగ్యలక్ష్మి పూర్తిగా కాలిపోయి మృతిచెందింది. కనీసం గుర్తించేందుకు కూడా వీలు లేకుండా మారింది. ఇంటి మొత్తానికి మంటలు అంటుకుని ఎగిసి పడటంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఆ ఇంటికి పైకప్పుగా ఉన్న బండలు సైతం కింద పడిపోయాయి. చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్, ఎస్‌ఐ రేణుకారెడ్డిలు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను సజీవదహనం చేసిన భర్త
బీర్కూర్(బాన్సువాడ) : కట్టుకున్న భార్యను కిరోసిన్ పోసి నిప్పటించి సజీవదహనం చేసిన ఘటన బీర్కూ ర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన మెరిగె అశోక్‌కు మెరిగె లక్ష్మి(35)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలుగా వారిమధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. భర్త అశోక్ రోజూ తాగివచ్చి భార్యను హింసించేవాడని చుట్టుపక్కల వారు వివరించారు.
కాగా రోజు మాదిరిగానే ఆదివారం తాగి వచ్చిన భర్తతో లక్ష్మి గొడవ పడింది. అనంతరం అశోక్ తన ఇద్దరు పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టాడు. అదే సమయంలో తల్లిదండ్రుల ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుమారుడిని బయటకు పంపించి వేసి అశోక్ తన భార్య లక్ష్మిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో సజీవదహనమైన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment