
సాక్షి, విజయనగరం : భర్త, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని ఇంతవరకు భార్యలు గృహహింస కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలోనే కాదు, రాష్ట్ర చరిత్రలో కూడా సంచలనం కల్గించేలా ఓ వ్యక్తి తన భార్య వేధిస్తోందనీ, తనకు మనోవర్తి ఇప్పించాలని కేసు వేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బలిజిపేటకు చెందిన బొమ్మాళి ప్రసాద్‌రావుకు నెల్లిమర్లకు చెందిన ఎర్రంశెట్టి రాజేశ్వరితో 2006 ఏప్రిల్ 23వ తేదిన వివాహం అయింది. 2008లో వీరికి ఒక పాప జన్మించింది. ప్రసాద్ రావు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. రాజేశ్వరి నెల్లిమర్లలో టీచర్‌గా పనిచేస్తున్నారు. 2006లో వివాహం అయిన తర్వాత విజయనగరం పట్టణంలోని తోటపాలెంలో నివాసం ఉండేవారు.
2008 తర్వాత రాజేశ్వరి నెల్లిమర్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం భార్య భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రాజేశ్వరి పోలీస్‌శాఖలో పనిచేసే తన సోదరి ద్వారా తనను మానసిక హింసకు గురిచేస్తోందని, తనకు రక్షణ కల్పించాలని ప్రసాద్‌రావు బొబ్బిలి కోర్టులో గత నెల 13వ తేదీన పిటిషన్ వేశారు. అంతేగాకుండా తనకు నెలకు రూ.20 వేలు మనోవర్తి కింద, ఇంటి అద్దెకు రూ.3 వేలు చొప్పన ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో కోర్టువారు ఆ పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా కేంద్రంలో ఉన్న గృహ హింస విభాగానికి పంపించారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ వద్ద సాక్షి ప్రస్తావించగా ప్రసాద్‌రావు అనే వ్యక్తి గృహ హింస కింద వేసిన పిటిషన్ కోర్టు నుంచి తన వద్దకు వచ్చిందని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పులో ఇటువంటి పిటిషన్ స్వీకరించవచ్చని ఉందని, అయితే న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండడానికి ఈ కేసును రిజిస్ట్రర్ చేయాలా వద్దా అని జిల్లా జడ్జికి లేఖ రాశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment