భార్యపై భర్త పైశాచికం | wife harrased by husband | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త పైశాచికం

Published Sun, Dec 24 2017 10:50 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

wife harrased by  husband

 సాక్షి, నూజివీడు :  కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచకు చెందిన బెజవాడ రామకృష్ణ అనే అతను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య రుద్రకళ్యాణిని(28) గొడ్డును బాదినట్లు బాదాడు. అపస్మారక స్థితి నుంచి బైటపడి పుట్టింటి వారికి ఫోన్‌ చేయగా వారు వెళ్లి ఆమెను తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్చిన మీదట ఈ సంఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 
ఆగిరిపల్లి మండలం సింహాద్రి ఏడుకొండలు, రేణుకమ్మల కుమార్తె అయిన రుద్రకళ్యాణి(28)ని ఏడాదిన్నర క్రితం నూజివీడు మండలం బోర్వంచకు చెందిన బెజవాడ రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు.  రామకృష్ణ కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగాను, రుద్రకళ్యాణి హిందీ పండిట్‌గాను పట్టణంలోని ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. ఈమెను పెళ్లిచేసుకున్న ఆరో రోజు నుంచే భర్త చిత్రహింసలు పెట్టేవాడు. ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి అయినప్పటికి అనాగరికంగా ప్రవర్తించేవాడు.  అతను ఎంత కొడుతున్నా అత్త కాని, ఆడపడుచులు కాని ఆపేవారే కాదు. ఇలా గొడవలు జరగడం, పెద్దల వద్ద పంచాయతీలు నిర్వహించడం మరల కాపురానికి పంపడం జరుగుతూనే ఉంది. ఇటీవల బాధితురాలు రుద్రకళ్యాణి భర్త బండి పై నుంచి కింద పడిపోవడంతో మోకాలుకు దెబ్బతగిలింది. దీంతో కాలు నెప్పిగా ఉండటంతో తను పాఠశాలలో పనిచేసే తోటి ఉపాధ్యాయిని ఇందు తన బండిపై ఎక్కించుకుని శుక్రవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఇంటి వద్ద దింపింది. ఇంటిలోకి వచ్చి చెప్పి వెళ్లకుండా వీధిలోనే ఎందుకు దింపి వెళ్లిందని చెప్పి రాత్రి 8.30గంటల ప్రాంతంలో రెండు కర్రలు విరిగేదాకా ఇష్టం వచ్చినట్లు గొడ్డును బాదినట్లు బాదాడు. దీంతో రుద్రకళ్యాణి శరీరం నిండా తీవ్ర గాయాలు కావడమే కాకుండా దెబ్బ  తగిలినటచోటల్లా ఎర్రగా దద్దులు ఏర్పడ్డాయి. ఈ దెబ్బలకు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఎప్పుడు స్పృహలోకి వచ్చిందో ఏమో కాని శనివారం ఉదయాన్నే ఫోన్‌ ద్వారా పుట్టింటికి ఫోన్‌ చేసి పెద్దనాన్న కొడుకైన వట్టిగుడిపాడు ఎంపీటీసీ సింహాద్రి రంగారావుకు విషయాన్ని చెప్పింది. దీంతో వెంటనే ఆయన బోర్వంచ వెళ్లి చెల్లెల శరీరంపై ఉన్న దెబ్బలు చూసి వైద్యచికిత్స నిమిత్తం  హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించాడు. నడుముపైన, భుజాలపైన, తొడభాగంలో ఎక్కడపడితే అక్కడ దెబ్బలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ చిరంజీవి శనివారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. 
పెళ్లైన ఆరోరోజు నుంచే వేధింపులు:
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి ప్రవేశించిన రుద్రకళ్యాణికి పెళ్లైన ఆరో రోజు నుంచే భర్త రామకృష్ణ వెధింపులను అనుభవించడం ప్రారంభమైంది. అత్త, ఆడబిడ్డలు కూడా లేనిపోని మాటలు చెప్తూ భర్తను ఆమెమీదకు ఉసిగొలిపేవారు. పలుమార్లు గొడవలు కావడంతో ఇరువైపులా పెద్దలు పంచాయతీ చేసి సర్దిచెప్పడం, మరల కాపురానికి పంపడం చేస్తుండేవారు. తన కుమార్తె జీవితం ఇలా అయిందేమిటని బాధతో, ఆవేదనతో తండ్రి ఏడుకొండలు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో లివరు పాడైపోయి మూడు నెలల క్రితమే చనిపోయాడు. రుద్రకళ్యాణి కూడా నాలుగు రోజుల క్రితమే పుట్టింటి వద్ద నుంచి భర్త ఇంటికి రాగా ఇంతలోనే ఇంత దారుణం జరిగింది. తోటి ఉపాధ్యాయిని బండిమీద తీసుకువచ్చి ఇంటివద్ద దింపినందుకు ఇంత దారుణంగా కొట్టడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు నండూరి పద్మాంజలి రూరల్‌ ఎస్‌ఐ చిరంజీవిని కలిసి నిందితుడికి కఠినశిక్ష పడేలా చూడాలని, ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement