
నిందితులు కవిత, సుమన్
నాగోలు: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ పృథ్వీదర్‌రావు, సరూర్‌నగర్ సీఐ రంగస్వామితో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, సత్తి తండాకు చెందిన నేనావత్ రాజు నాయక్ (26)కు సంస్థాన్ నారాయణపురం మండలం, వావిళ్లపల్లి బండి తండాకు చెందిన కవితతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వీరు ఎల్‌బీనగర్ లింగోజిగూడ విజయపురికాలనీలో ఉంటున్నారు. రాజునాయక్ మాదన్నపేటలోని ఓ హోటల్‌లో ఉదయం మాస్టర్‌గా, సాయంత్రం సంతోష్‌నగర్‌లోని మిర్చి కొట్టులో పనిచేసేవాడు.
రాజునాయక్ బంధువు మాదన్నపేట మార్కెట్‌లో పార్కింగ్ వద్ద ఉద్యోగం చేసే సుమన్ తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అతడికి కవితతో సాన్నిహిత్యం ఏర్పడటంతో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం దీనిని గుర్తించిన రాజునాయక్ భార్యను నిలదీయడంతో పాటు తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఇద్దరికీ సర్దిచెప్పారు. అయినా కవిత తన వైఖరి మార్చుకోకపోవడంతో రాజునాయక్ ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె ప్రియుడు సుమన్‌తో కలిసి అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నింది. గత నెల 31న రాత్రి రాజునాయక్ ఫుల్లుగా మద్యం తాగివచ్చి ఇంట్లో నిద్రిస్తుండగా సుమన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో సుమన్, తన బంధువైన మరో మైనర్ బాలుడు(16)తో కలిసి రాజునాయక్ ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాజునాయక్ కాళ్లు, చేతులను నైలాన్ తాళ్లతో కట్టివేసి చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని అతడి బైక్‌పైనే బాలుడి సహాయంతో మధ్యలో కూర్చొబెట్టుకొని తీసుకెళ్లి గుర్రంగూడ అటవీ ప్రాంతంలో పారవేశారు. అనంతరం కవిత అత్త, మామలతో కలిసి ఏప్రిల్ 1న సరూర్‌నగర్ ఠాణాకు వెళ్లి తన భర్త బయటికి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 2న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజునాయక్ మృతదేహం లభ్యమవడంతో కేసును సరూర్‌నగర్‌కు బదిలీ చేశారు. కవిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రియుడు సుమన్‌తో కలిసి హత్య చేసి నట్లు అంగీకరించింది. వీరితో పాటు హత్యకు సహకరించిన బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కవిత, సుమన్‌లకు జ్యుడీషియల్ రిమాండ్‌కు, మైనర్‌ను జ్యువైనల్ హోంకు తరలించారు. వీరి నుంచి నైలాన్ తాళ్లు, చున్నీ, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment