
ఖాశింవలి, ఖాశింబీ దంపతులు (ఫైల్)
ప్రకాశం , దర్శి: రెండు రోజుల్లో రంజాన్ పండుగ వస్తోంది.. కుటుంబంలో అంతా ఆనందంగా ఉండాల్సిన తరుణం.. ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పిల్లలు ఏమైపోతారోనన్న ఆలోచన ఆ కఠిన హృదయానికి కలగలేదు. ప్రియుడి కోసం భర్తను హత్య చేసింది. కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చీదరించుకునే పరిస్థితి కల్పించుకుని కటకటాల పాలవుతోంది.
ప్రియుడితో కలిసి ఖాశింబీ అనే మహిళ భర్త పాణెం ఖాశీంవలి (40)ని నోట్లో గుడ్డలు కుక్కి గొంతుకు వైరుతో బిగించి చంపిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని జెండా చెట్టు వద్ద వెలుగు చూసింది. మృతుడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కాశింబీ, ఆమె ప్రియుడు కరువాది రమణయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ఎదుటే భర్తను చంపానని బిడియం లేకుండా ఖాశింబీ చెప్పిన తీరుకు స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. రమణయ్య అనే మామిడి కాయల వ్యాపారితో ఖాశింబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లారీ ఖాశింవలీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. గతంలో భర్త లేని సమయంలో రమణయ్య ఆమె తరుచూ వచ్చి వెళ్తుండేవాడు. విషయం తెలుసుకున్న భర్త పిల్లల కోసం సర్దుకుపోయాడు. మొదట్లో కఠినంగా వ్యవహరించక పోవడం.. భర్త మెతక వైఖరి చూసి ఖాశింబీ మరింత బరితెగించింది. వివాహేతర సంబంధం పెచ్చుమీరి భర్త, పిల్లలు ఉన్నప్పుడే రమణయ్య కూడా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఇది చూస్తూ సహించని బంధువులు, స్థానికులు పలుమార్లు ఆమెకు చెప్పినా లెక్కచేయక పోగా వారిని కూడా దూషించడం ప్రారంభించింది.
ఇంట్లో తరుచూ గొడవలు జరిగాయి. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం పగలు ఆరోగ్యం బాగా లేదని భర్త ఇంట్లోనే ఉన్నాడు. ఇదే అదను అనుకుని కుమార్తెను రాత్రి జాగారానికి మసీదుకు పంపింది. పార్థన అనంతరం ఇంటికి వచ్చిన కుమార్తెను బయటే ఉంచి నాన్నకు బాగాలేదని, ఇబ్బంది పెట్టొద్దని నమ్మబలికింది. బలవంతంగా ఎదురింట్లో పండుకోమని చెప్పి పంపింది. అర్ధరాత్రి ప్రియుడిని రమ్మని పిలిచి ఇద్దరూ కలిసి భర్తను వైరుతో గొంతు బిగించి చంపింది. ప్రియుడిని పంపించి తెల్లవారు జామున ఏమీ ఎరగనట్లు భర్త చనిపోయాడని కేకలు పెట్టింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడితో కలసి నీవే చంపావని ఆమెను పోలీసుల ఎదుట కుటుంబ సభ్యులు నిలదీశారు.
అవును నేనే చంపాను.. ఏం చేస్తారని ఎదురు తిరగడంతో అక్కడి వారంతా ముక్కున వేలేసుకున్నారు. పోలీసులు ఖాశీంబీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి మృతి చెంది తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దిక్కులేని వారయ్యారు. ఆమె పేరున ఉన్న ఆస్తిని పిల్లల పేరున రాయించి నమ్మకంగా ఉన్న వారిని గార్డియన్‌గా పేర్కొనాలని బంధువులు కోరుతున్నారు. ఆస్తి కోసం తల్లి పిల్లలనైనా చంపదని గ్యాంరంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల జోక్యం చేసుకుని పిల్లలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ ఎం.శ్రీనివాసరావు ప్రాథమికంగా హత్యగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విలపిస్తున్న మృతుడి సోదరి
Comments
Please login to add a commentAdd a comment