
నిందితురాలు రిగాని బేగం అక్బర్(ఫైల్) కాలిత్ అహ్మద్ (ఫైల్)
వేలూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించి స్నేహితులతో కలిసి భర్తను ఓ భార్య కడతేర్చింది. భార్య సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వేలూరు జిల్లా రాణిపేటలో జరిగింది.
రాణిపేట స్వామినాయుడు వీధికి చెందిన అసిఫ్ అలియాస్ అక్బర్(31) పశువుల వ్యాపారి. ఇతను గత నెల 7న వాలాజ సమీపంలోని వళ్లివేడు జాతీయ రహదారి పక్కన అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి విచారణ చేపట్టారు. అక్బర్ భార్య రిగానీ బేగం(27) భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం వాలాజ సమీపంలోని బాగవెలి గ్రామానికి చెందిన రాజకుమారుడు వివేక్ వళ్లివేడు గ్రామ పరిపాలన కార్యాలయానికి వచ్చాడు. ఈ సమయంలో గ్రామ పరిపాలన అధికారి సత్యమూర్తి వద్ద తాను తన స్నేహితులు కలిసి పశువుల వ్యాపారి అక్బర్‌ను గత నెల 6వ తేదీన రాత్రి హత్య చేశామని అనంతరం ఆతని మృతదేహాన్ని జాతీయ రహదారి పక్కన వేసి వెళ్లామని తెలిపాడు. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న వీఏఓ సత్యమూర్తి వెంటనే వాలాజ సోలీసులకు సమాచారం ఇచ్చాడు. వివేక్ వద్ద పోలీసులు జరిపిన విచారణలో అక్బర్ భార్య రిగానిబేగంకు వివేక్ స్నేహితుడు కాలిత్ అహ్మద్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. విషయం తెలిసి అక్బర్ భార్యను మందలించాడని, దీంతో ఆగ్రహించిన రిగానిబేగం, ప్రేమికుడు కాలిత్ అహ్మద్ కలిసి అక్బర్‌ను హత్య చేసేందుకు ప్రణాళికి సిద్ధం చేసుకున్నారన్నారు. దీంతో కాలిత్ అహ్మద్ స్నేహితులైన బెల్లియప్ప నగర్‌కు చెందిన సతీష్, బాగవెలికి చెందిన వివేక్, కృపాకరన్, లోకనాథన్‌ల సాయంతో అక్బర్‌ను హత్య చేయాలని నిర్ణయించి హత్య చేసినట్టు నేరం అంగీకరించారు. పోలీసులు హత్యకు కారణమైన అక్బర్ భార్య రిగానిబేగం, వివేక్, సతీష్, కృపాకరన్‌లను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment