
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు
అనంతపురం, ఓడీ చెరువు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితోపాటు మరోవ్యక్తితో కలిసి అంతమొందించింది. నేరం తనపైకి రాకుండా అనుమానాస్పద కేసుగా చిత్రీకరించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన తంబాల పెద్ద ఆదెప్ప(35) తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో భార్య రమాదేవి అదే గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడు మంజునాథ్‌తో కలిసి పథకం రచించింది.
ఇందుకు చరణ్ అనే మరో వ్యక్తిని సాయం కోరింది. ఈమేరకు చరణ్ ఈ నెల 18న రాత్రి(సోమవారం) మద్యం సేవిద్దామని చెప్పి పెద్ద ఆదెప్పను మండల కేంద్రంలోని చెరువులోకి పిలుచుకెళ్లాడు. అక్కడ పూటుగా మద్యం తాపాడు. ఇంతలో మంజునాథ్, రమాదేవి అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న పెద్ద ఆదెప్పను ముగ్గురూ కలిసి గొంతు, మర్మావయవాలు నులిమి చంపేశారు. తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకున్నారు. మంగళవారం మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లమాడ సీఐ నరసంహారావు, ఎస్‌ఐ ఫణిధర్‌కుమార్‌రెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహారావు, ఎస్‌ఐ ఫణిధర్‌కుమార్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment