
భార్యాభర్తలంటే ఒకరికోసం ఒకరు జీవించాలి.. అయితే సమస్యలు, మనస్పర్దల కారణంగా ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. వివాహబంధం మధ్యలోనే తెగిపోతోంది. శుక్రవారం నగరంలో వేర్వేరుచోట్ల భార్యను భర్త, భర్తను భార్య హత్యచేశారు.
మన్సూరాబాద్: ఓ మహిళ తన భర్త వేధింపులను భరించలేక చివరకు అతనిని హత్యచేసింది. ఎల్‌బీనగర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం వెలిజెర్ల గ్రామానికి చెందిన దేవలపల్లి వెంకటేష్ (45)కు సరూర్‌నగర్‌కు చెందిన దుర్గకళ అలియాస్ బుజ్జి సరూర్‌నగర్ భగత్‌సింగ్‌నగర్ కాలనీలో నివాసముంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేష్ ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలను వేధిస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి రూ.500 తీసుకెళ్లి మద్యం తాగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి మరలా రూ.5 వేలు కావాలని గొడవపడ్డాడు.
ఇప్పటికే బాగా ఆలస్యమైందని, ఉదయం డబ్బులు ఇస్తానని భార్య చెప్పినా వినకుండా గొడవపడ్డాడు. అడ్డు వచ్చిన పిల్లలను చంపేస్తానని కత్తిపీట తీసుకుని బెదిరించాడు. ఈ క్రమంలోదుర్గకళ సమీపంలో ఉన్న చపాతీ కర్రతో భర్త వెంకటేష్‌ను కొట్టి అతని చేతిలో ఉన్న కత్తి పీటను లాక్కుని తలపై బాదింది. దీంతో తల నుంచి రక్తస్రావమైంది. నైలాన్ తాడుతో గట్టిగా అతని మెడపైన అడ్డంగా కట్టి నులమడంతో తీవ్ర రక్తస్రావం జరిగి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి దాడికి ఉపయోగించిన కత్తిపీట, అట్లకర్ర, నైలాన్‌తాడును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎల్‌బీనగర్ ఏసీపీ పృద్వీదర్‌రావు, సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి, సిబ్బంది అర్జునయ్య, మన్మదకుమార్, మహేష్, రాజేష్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
మలక్‌పేట: భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ జరిగింది. ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం కామ్ జమాల్‌పురం గ్రామానికి చెందిన ఒగ్గు నర్సింహ, ముత్తమ్మ(32) దంపతులు గడ్డిఅన్నారంలోని పోచమ్మ బస్తీలో నివాసం వుంటున్నారు. నర్సింహ దిల్‌సుఖ్‌నగర్‌లో పండ్ల వ్యాపారం చేస్తుండగా ముత్తమ్మ రోటీ పాయింట్‌లో రొట్టెలు తయారు చేస్తుండేది. వీరికి సిద్దు(14), మహేశ్(11) ఇద్దరు సంతానం. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో క్రమంగా గొడవలు తలెత్తాయి. భార్య ముత్తమ్మపై అనుమానం పెంచుకున్న నర్సింహ ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. వారం క్రితం నగరంలోని జుమేరాత్ బజార్‌లో గొడ్డలి కొనుగోలు చేసి అదనుకోసం వేచిచూడసాగాడు. గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య తలపై గొడ్డలితో బలంగా మోదాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నర్సింహ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. ఇన్‌స్పెక్టర్ నర్సింహను విచారించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment