బానోతు జగన్ మృతదేహం ,నిందితురాలు బానోతు దేవిక
బంజారాహిల్స్: అనుమానిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను తానే చంపానంటూ నిందితురాలు పేర్కొంటుండగా అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని ఆమె కుమారుడు పోలీసులకు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, గారకుంటతండాకు చెందిన బానోతు జగన్(35), దేవిక దంపతులు జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఉదయ్(8), జోషితశ్రీ(6) అనే ఇద్దరు సంతానం. జగన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని బర్త్‌ప్లేస్ పిల్లల ఆస్పత్రిలో రన్నర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా దేవికపై అనుమానం పెంచుకున్న జగన్, తాను లేని సమయంలో అపరిచిత వ్యక్తి ఇంటికి వచ్చిపోతున్నాడని ఆమెను వేధిస్తున్నాడు.
సోమవారం రాత్రి జగన్ తన బావమరిది రమేష్‌కు ఫోన్ చేసి మద్యం కావాలని అడిగాడు. అతని సూచన మేరకు ఫిలింనగర్‌లోని బెల్టుషాపుకు వెళ్లి బీరు తీసుకువచ్చాడు. అందులో నల్లుల మందు కలిపి ఇద్దరం తాగుదామంటూ భార్యకు ఇవ్వగా, చస్తే నువ్వు చావు నేనెందుకు చస్తానంటూ దేవిక ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంగా బీరు సీసాతో తనను పొడిచేందుకు వస్తున్న భర్త ప్రైవేట్ పార్ట్‌లపై గట్టిగా తన్నడంతో జగన్ కుప్పకూలిపోయాడు. ఏడుస్తున్న పిల్లలను బాత్‌రూమ్‌లోకి నెట్టి బయట గడియ పెట్టిన దేవిక భర్త పొత్తికడుపుపై కూర్చొని రెండు చేతులతో గొంతు నులిమి హత్య చేసింది. తెల్లవారుజామున సమీపంలో ఉండే తన సోదరుడు రమేష్‌కు సమాచారం అందించింది. ఈ అలికిడితో మేల్కొన్న ఇంటి యజమాని హత్య జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించింది. అనుమానంతో వేధిస్తున్నందునే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితురాలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హత్యపై అనుమానాలు ఉండటంతో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు మూడు బృందాలుగా విడిపోయారు. మరో వ్యక్తి సాయంతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు ఉండటంతో అతడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
అమ్మ చెప్పొద్దంది..
సోమవారం రాత్రి డాడీ నిద్రపోతుండగా వెనక బ్యాగు వేసుకున్న గడ్డం అంకుల్ ఇంటికి వచ్చాడంటూ ఉదయం దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులకు మృతుడి కుమారుడు ఉదయ్ తెలిపాడు. అయితే ఈ విషయాన్ని తన తల్లి ఎవరికీ చెప్పొ ద్దని చెప్పిందని తెలిపాడు. దీనికితోడు ఇంటి యజమాని కూడా రాత్రి రెండు సార్లు గేటు దూకి ఓ వ్యక్తి వచ్చినట్లు అలికిడయ్యిందని.. దొంగలు వచ్చారంటూ మరో గదిలో అద్దెకుండే వారు చెప్పడంతో తాను కర్ర, కారంపొడి తీసుకొని వెళ్లినట్లు తెలిపాడు. ‘మృతుడు జగన్ అనుమానాలు, రాత్రిపూట ఓ వ్యక్తి వచ్చాడని కొడుకు చెప్పడం, ఇంటి యజమాని ఆరోపణలు, దేవిక తన ఇద్దరు పిల్లలను బాత్‌రూమ్‌లో వేసి గడియ పెట్టడం’ తదితర అంశాల నేపథ్యంలో మరో వ్యక్తి అండతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితురాలి ఫోన్ కాల్‌డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment