నిందితుడు బెనర్జి, బాత్‌రూమ్‌లో చిన్నారులు ఉదయ్, జ్యోతశ్రీ
వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ దారుణాన్ని చూసిన తన పిల్లలను బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసింది. భర్త మృతి చెందాడని నిర్థారించుకున్నాక శవం పక్కనే ప్రియుడితో గడిపినట్టు సమాచారం. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీలో జరిగింది.
బంజారాహిల్స్: ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చింది ఓ కసాయి ఇల్లాలు. పక్కా పథకంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడమే కాకుండా ఈ ఘటనలో ప్రియుడిని కేసు నుంచి తప్పించేందుకు తానే హత్య చేశానంటూ పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. హత్య చేస్తున్న సమయంలో పిల్లలు చూడకుండా ఇద్దరినీ బాత్‌రూమ్‌లో వేసి గడియ వేసింది. కట్టుకున్న భర్త తుదిశ్వాస విడిచాడని నిర్థారణకు వచ్చాక ప్రియుడితో కలిసి మద్యం తాగి శవం పక్కనే ఇద్దరూ గడిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న జగన్ హత్య మిస్టరీనిబంజారాహిల్స్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ హత్యలో మృతిడి భార్య దేవికతో పాటు ఆమె ప్రియుడు తోట బెనర్జీ(32) హస్తం ఉన్నట్లు నిర్థారించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని జ్ఞాని జైల్‌సింగ్ నగర్ బస్తీలో బర్త్‌ప్లేస్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బానోతు జగన్(35), దేవిక(30) దంపతులు అద్దెకుంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉదయ్, ఆరేళ్ల కూతురు జ్యోతశ్రీ ఉన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి(32) ఫిలింనగర్‌లోని అడ్వాన్ సాఫ్ట్ బీపీఓలో లైజన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
ఇదే సంస్థలో దేవిక హౌస్ కీపింగ్ పనిచేసేది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి దగ్గరయ్యారు. ఏడాది క్రితం బెనర్జి దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. కుటుంబ సభ్యులు అతడిని తిట్టి పనిచేస్తున్న సంస్థ వద్దకు వచ్చి చితకొట్టారు. ఆరు నెలల క్రితమే దేవిక అక్కడ హౌస్‌కీపింగ్ పనుల నుంచి తప్పుకుంది. అయితే భర్త కళ్లుగప్పి ప్రియుడితో తరచూ కలుస్తుండేది. అనుమానం వచ్చిన జగన్ పలుమార్లు ఆమెను హెచ్చరించి పరువుతీయవద్దంటూ బెదిరించాడు. ఇలా అయితే లాభం లేదనుకున్న బెనర్జి, దేవిక ఒకే ఇంట్లో అద్దెకుంటే ఈ గొడవ ఉండదని అనుమానాలు కూడా రావని నిశ్చయించుకున్నారు. రెండు నెలల క్రితం బెనర్జి.. జైల్‌సింగ్ నగర్‌లోని ఓ ఇంటిలో జగన్ దంపతులను అద్దెకు దిగేలా చేశాడు. తర్వాత రెండు రోజులకే తాను కూడా అదే ఇంటి పెంట్‌హౌస్‌లోకి మారుపేరుతో అద్దెకు దిగాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఇద్దరూ కలుసుకునేవారు.
తమ ప్రేమకు అడ్డు వస్తున్న భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ వేసి సోమవారం అర్ధరాత్రి ఇందుకు సరైన సమయంగా నిర్ణయించారు. బెనర్జీని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి పిలిపించి నిద్రిస్తున్న జగన్ మర్మాంగాలను దేవిక గట్టిగా పిసికేస్తుండగా అతడి ఛాతిపై బెనర్జి కూర్చొని ముఖాన్ని, గొంతును నులిమేశారు. అరగంట పాటు జగన్ ప్రాణం రక్షించుకునేందుకు పెనుగులాడినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నిద్ర లేచిన పిల్లలు ఈ ఘటనను చూస్తుండడంతో వారిద్దరినీ ఈ కసాయితల్లి బాత్‌రూమ్‌లో వేసి గడియ వేసింది. భర్త చనిపోయాక అక్కడే మద్యం తాగి ఇద్దరూ కలిసి గడిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే గంట తర్వాత బావ చనిపోయాడంటూ దేవిక తన సోదరుడికి ఫోన్ చేసింది. అప్పటికే బెనర్జీ అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ విషయం పోలీసుకు చేరడంతో వారు అక్కడకు చేరుకోగా దేవిక చేతులకు గాట్లు పెట్టుకొని వారిని నమ్మించేయత్నం చేసి విఫలమైంది.
పిల్లలు దేవుళ్లు...
పిల్లలను దేవుళ్లు అని ఎందుకంటారో జగన్, దేవిక దంపతుల ఇద్దరి చిన్నారుల ఉదంతం కళ్లకు కట్టింది. భర్తను తానే చంపానని దేవిక అంటుండగా అర్ధరాత్రి ఓ అంకుల్ వచ్చాడని చిన్నారి ఉదయ్ పోలీసులకు చెప్పాడు. ఓ వైపు దేవిక హత్య తానే చేశానని చెబుతుంటే బాలుడు మరొకరు ఉన్నారంటూ చెప్పడంతో పోలీసులు ఆ దిశలోనే దర్యాప్తు చేశారు. మృతుడి బావమరిది రమేష్‌ను విచారించగా ఆరు నెలల క్రితం జరిగిన బెనర్జీ గొడవను ప్రస్తావించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అడ్వాన్ సాఫ్ట్ సంస్థకు వెళ్లి బెనర్జీ గురించి విచారించగా హత్య జరిగిన ఇంటి టెర్రస్‌పై ఉంటాడని తేలింది. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అడ్వాన్ సాఫ్ట్ అధికారితో ఫోన్ చేయించి సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా టీవీ 9 పక్క సందులో ఓ ఆటోలో దాక్కున్న నిందితుడిని పట్టుకున్నారు. విచారించగా హత్యకు తాను కూడా సహకరించినట్లు ఒప్పుకున్నాడు.
ఆగమైన చిన్నారుల బతుకులు
కన్నతల్లి కర్కశత్వానికి ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన తల్లి పిల్లల భవిష్యత్తును ఆగం చేసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన దేవిక పిల్లలు ఆగమయ్యారు. ఎటు వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లలు తల్లి పోలీస్ స్టేషన్‌లో ఉండడంతో రెండు రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కళ్లముందే తల్లి తమ తండ్రిని హతమారుస్తుంటే నిశ్చేష్టులై చూసిన ఆ చిన్నారులపై ఏ మాత్రం దయకలగలేదు. ‘అమ్మా.. అమ్మా’.. అంటూ ఏడుస్తున్నా ఆ కిరాతకురాలి మనసు కరగలేదు. ఎవరికైనా చెబితే మీరూ చస్తారంటూ ఇద్దరినీ బాత్‌రూమ్‌లో వేసి గడియ వేసింది. ఇప్పుడు ఈ చిన్నారులు ఎక్కడ ఉండాలన్నదానిపై చర్చ మొదలైంది. అరకొర సంపాదనతో తాను బతుకు వెళ్లదీయడమే కష్టంగా ఉన్న మేనమామ రమేష్.. ఈ ఇద్దరి పోషణ బాధ్యతలు కూడా ఎంత వరకు తీసుకుంటాడన్నది సందేహంగా మారింది. రెండు రోజులుగా తల్లి పోలీస్‌స్టేషన్‌లోని పై అంతస్తులో ఉండగా.. చిన్నారులు స్టేషన్ ఆవరణలో గడుపుతున్నారు. గంటకోసారి తల్లిని చూసి వస్తున్నా ఆ తల్లి ఏ మాత్రం చింతించడం లేదు. తాను చేసిన పని పట్ల కించిత్తు ఆవేదన కూడా చెందకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment