హతుడు రమేష్(ఫైల్)
ఖమ్మంక్రైం/కూసుమంచి : ఆమె ఓ వివాహిత.. వేరొక వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదేం పద్ధతంటూ భర్త తనను మందలించడం ఆమె సహించలేకపోయింది. తన భర్తను చంపాలంటూ ప్రియుడిని పురమాయించింది. అతడు పక్కా పథకం వేసి.. గుట్టుగా ప్రాణం తీశాడు. ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో హత్యకు గురైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముత్తి తండా వాసి కావడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది.
గార్ల మండలం ముత్తితండాకు చెందిన భూక్యా రమేష్(30), కమల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ గార్లకు చెందిన ఆగడాల రామారావు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. దీంతో రమేష్ ఇంటికి రామారావు తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే రమేష్ భార్య కమలతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి వ్యవహారం రమేష్ కంటపడింది. పద్ధతి మార్చుకోవాలంటూ తన భార్యను రమేష్ హెచ్చరించాడు.
ఈ క్రమంలోనే అతడు ఈ నెల 12న ట్రాక్టర్‌కు మరమ్మతు చేయించేందుకు ఖమ్మం కాల్వొడ్డులోగల షోరూమ్ షెడ్డుకు వెళ్లాడు. రామారావు వద్ద గతంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేసిన సురేష్ రమేష్‌కు ఖమ్మంలో కనిపించడంతో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. జేసీబీ డ్రైవర్‌గా పని ఇప్పిస్తానని రమేష్‌తో సురేష్ చెప్పి వెళ్లిపోయాడు. సురేష్ వెళ్లిపోయిన తర్వాత రామారావుకు రమేష్ ఫోన్ చేసి తాను పని మానేస్తానని, సురేష్ దగ్గరికెళ్లి జేసీబీ డ్రైవర్‌గా చేస్తానని చెప్పాడు.
రామారావు కమలకు ఫోన్ చేసి రమేష్ చెప్పినదంతా చెప్పాడు. వెంటనే ఖమ్మం వెళ్లి రమేష్‌ను చంపేయ్ అని ఆమె బదులిచ్చింది. దీంతో రామారావు తన వద్ద పనిచేస్తున్న మరో డ్రైవర్ గుండోజు కృష్ణమాచారికి డబ్బు ఆశ చూపి ఖమ్మం తీసుకెళ్లాడు. ఖమ్మంలో రమేష్‌ను బైక్‌పై ఎక్కించుకుని కూసుమంచిలో ఉన్న సురేష్ వద్దకు బయల్దేరారు. కూసుమంచిలో మద్యం తాగారు. తర్వాత ముగ్గురూ కలిసి సురేష్ స్వగ్రామం రాజుపేటకు బయల్దేరారు.
మార్గమధ్యలో పాలేరువాగు వద్ద మూత్ర విసర్జనకని బైక్ ఆపారు. బైక్ దిగి కొద్దిగా ముందుకెళ్లాక కృష్ణమాచారికి రామారావు సైగ చేశాడు. ఆ వెంటనే రమేష్‌ను కృష్ణమాచారి గట్టిగా పట్టుకోగానే రామారావు తన వద్దనున్న బ్లేడ్‌తో రమేష్ గొంతు కోయడంతో విలవిలలాడుతూ ప్రాణాలొదిలాడు. తర్వాత మృతదేహాన్ని వాగు వద్దనున్న తుప్పల్లో పడేశారు. అక్కడి నుంచే కమలకు రామారావు ఫోన్ చేశాడు. రమేష్‌ను హత్య చేసినట్టుగా చెప్పాడు. ఈ హత్యను సురేష్ చేసినట్టుగా మరో పథకం వేశారు.
చిక్కారు ఇలా..
రమేష్‌ను హత్య చేసిన తర్వాత రామారావు, కృష్ణమాచారి కలిసి గార్ల వెళ్లారు. రెండు రోజుల తర్వాత, రమేష్ ఇంటికి కమల వెళ్లింది. ఖమ్మం వెళ్లిన రమేష్ తిరిగి రాలేదని అతడి తల్లిదండ్రులతో చెప్పింది. వారు అన్నిచోట్ల వెతికారు. ఆచూకీ తెలియలేదు. ఈ మధ్యలో సురేష్‌కు రామారావు ఫోన్ చేసి, ‘రమేష్‌ను నువ్వు కలిశావట. నీ వద్దకు వెళుతున్నానని నాకు చెప్పాడు’ అన్నాడు. తామిద్దరం కలిసింది నిజమేనని, రమేష్ ఏమయ్యాడో తనకు తెలియదని సురేష్ చెప్పాడు.
ఈ నెల 21న రామారావు, కమల కలిసి ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రమేష్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. తమకు సురేష్‌పై అనుమానం ఉందని రామారావు చెప్పాడు. త్రీటౌన్ సీఐ వెంకన్నబాబు ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రీనివాస్, మహేష్ దర్యాప్తు చేపట్టారు. రామారావు, కమల సెల్‌ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. కమలతో రోజూ రామారావు ఫోన్‌లో మాట్లాడడం, అదృశ్యమైన రోజున వారిద్దరి మధ్య ఎక్కువసార్లు ఫోన్ సంభాషణ జరగడం గుర్తించారు.
వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. మృతదేహాన్ని పడేసిన చోటికి పోలీసుల అధికారులను తీసుకెళ్లి చూపించారు. కుళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. హత్య చేసిన రామారావును, అతడికి సహకరించిన కమల, కృష్ణమాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్–కమల దంపతుల పిల్లలిద్దరు దిక్కులేని పక్షులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment