
సాక్షి, చెన్నై: ప్రేమ వివాహం చేసుకున్న భర్తను పెళ్లైన 20 రోజులకే ఓ భార్య సజీవదహనం చేసింది. నిద్రిస్తున్న భర్తతో పాటు ఇంటిని కూడా తగల బెట్టేసింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీ నగర్‌కు చెందిన దక్షిణా మూర్తి, మారియమ్మాల్ దంపతుల దత్త పుత్రుడు సేతుపతి దిండివనంకు చెందిన మురుగవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహమై 20 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సేతుపతి ఇళ్లు తగల బడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఇంటి బయట గడియపెట్టి ఉండడం, లోపల సేతుపతి సజీవ దహనమైన పడిఉండడం, మురుగవేణి కనిపించకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి.
దిండివనంలో తల్లి కుముదాతో ఉన్న మురుగవేణిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా భర్తను సజీవ దహనం చేసి అగ్ని ప్రమాదం నాటకాన్ని ఆమె ఆడడం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు బుద్ధిమంతుడుగా ఉన్న సేతుపతి, పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజూ మద్యం తాగి రావడం, రాత్రుల్లో నరకం చూపిస్తుండడం, అనుమాన పడడం, నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిడుతుండడంతో అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించినట్టు పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. గురువారం సాయంత్రం పూటుగా మద్యం తాగి మత్తులో ఉన్న సేతుపతిని ఇంటితో పాటు తగులబెట్టి అగ్నిప్రమాదం జరిగినట్టుగా నాటకం ఆడానని వివరించారు. అయితే, బయట తాళం వేసి ఇరుక్కుపోయానని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment