
అన్నానగర్: కాంచీపురం సమీపంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వెంబాక్కం సమీపం పిల్లాతాంగల్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ (32) భార్య పునిత (26). వీరికి ఆరు నెలల ముందు వివాహం జరిగింది. పుష్పరాజ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత 20వ తేదీ పనికి వెళ్లిన పుష్పరాజ్ తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం కాంచీపురం జిల్లా కోలివాక్కం నది ఒడ్డున పుష్పరాజ్ మృతదేహం లభించింది. నిందితులను అరెస్టు చేయాలని బుధవారం పుష్పరాజ్ మృతదేహాన్ని వెంబాక్కం– కాంచీపురం రోడ్డుపై ఉంచి బంధువులు రాస్తారోకో చేశారు. ఘటనపై కాంచీపురం తాలూకా సీఐ వెట్రిసెల్వన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
హత్యకు సంబంధించి పుష్పరాజ్ భార్య పునిత, ఆమె ప్రియుడు ప్రకాష్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు మాట్లాడుతూ పుష్పరాజ్‌ను వివాహం చేసుకోవడానికి ముందే పునిత, ప్రకాష్ ప్రేమికులు. వివాహం అయిన తరువాత కూడా పునిత ప్రియుడితో స్నేహం కొనసాగింది. ఇది తెలుసుకున్న పుష్పరాజ్, పునితని మందలించాడు. వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పుష్పరాజ్‌ను హత్య చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పునిత, ప్రియుడు ప్రకాష్‌తో కలిసి పుష్పరాజ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు వారి వద్ద విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment