భర్త ఇంటిముందు చంటిపిల్లలతో నిరసన తెలుపుతున్న కొత్తకోట జోత్స్న
శ్రీకాకుళం, కాశీబుగ్గ: భర్త ఇంటి ముందు ఓ భార్య నిరసన తెలిపింది. తనకు భర్త కావాలంటూ ఆందోళన చేసింది. తన భర్తకు వివాహేతర సంబంధం కారణంగా, తనను వరకట్నం వేధింపులకు గురిచేస్తూ ఇంటినుంచి బయటకు గెంటేశారని ఆరోపించింది. పోలీసులు తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సంఘటన పలాసలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.
కాశీబుగ్గకు చెందిన జ్యోత్స్ననకు పలాసకు చెందిన కొత్తకోట జగన్‌తో నాలుగున్నరేళ్ల క్రితం వివాహామైంది. పెళ్లి సమయంలో జ్యోత్స్న తల్లిదండ్రులు 10 తులాల బంగారంతో పాటు సారెతో అత్తవారింటికి సాగనంపారు. తర్వాత పండగలకు పబ్బాలకు తమ కుమార్తెకు సుమారు ఐదు తులాల బంగారం అందించారు. అయితే పెళ్లైన ఆరు మాసాలు వరకు భర్త జగన్, అత్తమామలు కొత్తకోట విశ్వేశ్వరరావు, సుజాతలు, ఆడపడుచు మంగ తనను బాగా చూసుకున్నారని బాధితురాలు జోత్స్న తెలిపారు. తర్వాత తన భర్త జగన్‌కు పూండిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం ఉండడంతో తనను వేధించడం మొదలు పెట్టాడని ఆరోపించారు. అప్పుడప్పుడు రాత్రివేళ ఇంటికి వచ్చేవాడు కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు వరకట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని ఆవేదన చెందారు. తన వద్ద ఉన్న బంగారం అంతా వారు తీసుకొని తనను ఇంటినుంచి బయటకు గెంటివేశారని పేర్కొన్నారు. వారి వేధింపులు భరించలేక చిన్న పిల్లలతో కలిసి సుమారు 9 నెలల కిందట తన పుట్టింటికి వెళ్లిపోయినట్టు చెప్పారు.
అయితే తన భర్త తనకు కావాలని కాశీబుగ్గ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశానని తెలిపారు. అటు నుంచి అటే నేరుగా భర్త ఇంటికి వెళ్లానన్నారు. ఇంటికి చేరుకోగానే అత్తమామలు, ఆడపడుచు తలుపులు వేసి పొమ్మన్నారని తెలిపారు. దీంతో ఇంటి ముందు పిల్లలతో కలిసి బైటాయించి నిరసన తెలిపినట్టు చెప్పారు. ఆకలితో చిన్నారులు ఏడ్చుతున్నా తలుపులు తీయలేదని ఆవేదన చెందారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారని, వారు తన అత్తమామలు, ఆడపడుచుకు నచ్చచెప్పినా తలుపులు తీయడంలేదన్నారు. అదనపు కట్నం కావాలో! లేక నన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారో! అర్ధంకావడం లేదని, తనకు మాత్రం భర్తేకావాలి పట్టుబట్టి భర్త ఇంటిముందు నిరసన తెలిపింది. తన పాప భాష్యకు మూడున్నరేళ్లు ఉంటాయని కాశీబుగ్గ లిటిల్‌కిడ్స్‌లో ఎల్‌కేజీ చదువుతోందని, బాబు ఠాగూర్‌కు ఒకటిన్నర ఏళ్లు నిండాయని జోత్స్న తెలిపారు. తన తల్లిదండ్రులు పేదవారని, తండ్రికి గుండె సమస్యతో అనారోగ్యం పాలయ్యారని, ఆయన ఆరోగ్య రీత్యా ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్లి యున్నారని ఆవేదన చెందింది.
Comments
Please login to add a commentAdd a comment