వెలిగొండలో భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగిన ఝాన్సీరాణి (ఇన్‌సెట్) భర్త నరేష్ (ఫైల్)
అనంతపురం, ఉరవకొండ: అడిగినంత కట్న కానుకలు.. అంగరంగ వైభవంగా పెళ్లి.. ఏడాది తర్వాత భార్యపై భర్తకు అనుమానం.. ప్రతి చిన్న విషయాన్నీ బూతద్దంలో చూపుతూ వేధింపులు.. రెండేళ్లుగా అదనపు కట్నం కోసం ఒత్తిళ్లు.. భర్తను కలవనీయని అత్తమామలు.. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ ఇల్లాలు మెట్టినింటి ఎదుట మౌనదీక్షకు కూర్చుంది. న్యాయం జరగకపోతే ఈ ఇంటి వద్దే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమున్నీరవుతూ ప్రకటించింది. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
తాడిపత్రికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జి.నాగరంగయ్య, కాంతమ్మ దంపతుల పెద్ద కుమార్తె ఝాన్సీరాణికి ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన మొక్కిన శ్రీరాములు, సువర్ణమ్మ దంపతుల కుమారుడు మొక్కిన నరేష్‌కు 2015 మార్చి 8న వివాహమైంది. కట్న కానుకలకింద నరేష్‌కు రూ.10 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారం ఇచ్చారు. దీంతో పాటు రూ.5లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. నరేష్ ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుడంతో అక్కడే కాపురం పెట్టారు.
అనుమానంతో చిత్రహింసలు
ఏడాది పాటు సంసారం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి భర్త ప్రతి చిన్న విషయానికీ అనుమానంతో ఝాన్సీరాణిని ఇబ్బంది పెట్టేవాడు. దీనికి తోడు నరేష్ తన తల్లిందండ్రుల మాట విని అదనపు కట్నం కోసం వేధించసాగాడు. మీ పుట్టింటికి వెళ్లి రూ.20లక్షలు తీసుకురా (అదనపు కట్నం) అంటూ ముంబైలో నిత్యం వేధింపులకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేక ఝాన్సీరాణి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కుమార్తెను అల్లుడు ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో 2017జూన్‌లో తాడిపత్రికి తీసుకొచ్చారు. దీనిపై ఎన్నోసార్లు నరేష్‌తో, వారి తల్లిదండ్రులతో మాట్లాడించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఝాన్సీరాణి న్యాయం కోసం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉరవకొండ స్టేషన్‌లో కుడా ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నరేష్ తండ్రి శ్రీరాములుకు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేక పోతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
భర్త ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా: తనకు తనభర్తతో కలిసి జీవించేలా చేయకపోతే, వారి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఝాన్సీరాణి స్పష్టం చేసింది. భర్త ఇంటి ముందే మౌనదీక్ష కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment