
తీవ్రగాయాలతో హోంగార్డు అబ్దుల్ ఇమ్రాన్
చాంద్రాయణగుట్ట: భార్యను సరిగా చూసుకోలేని స్థితిలో ఉన్న భర్త వెంటనే విడాకులు ఇవ్వాలంటూ ఓ హోంగార్డును ముగ్గురు దారుణంగా కొట్టిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జీఎం కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఇమ్రాన్ ఇంటెలిజెన్స్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో తాళ్లకుంటలోని సుహానా ఫంక్షన్ హాల్ ఎదురుగా తన ద్విచక్ర వాహనానికి వాషింగ్ చేయిస్తున్నాడు.
ఈ సమయంలో హబీబ్ ఇమ్రాన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి హోంగార్డును కొట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా అతని మర్మాంగాలపై తీవ్రంగా తన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు డయల్ 100కి కాల్ చేసేందుకు ప్రయత్నించగా ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. మరో ఇద్దరు కూడా కలిసి అతడి ముఖంపై తీవ్రంగా కొట్టారు. ‘నీ భార్యకు విడాకులు ఇవ్వు.. లేదంటే చంపేస్తాం’ అని బెదిరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారు బాధితుడికి దూరపు బంధువులుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. దాడికి దిగిన ప్రధాన నిందితుడు హబీబ్ ఇమ్రాన్ గతంలోనూ తనను తీవ్రంగా బెదిరించినట్లు అబ్దుల్ ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment