నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీరామ్
కొమరోలు (గిద్దలూరు): మండలంలోని మలికపల్లె సమీపంలోని శ్మశానంలో హత్యకు గురైన పందనబోయిన కృష్ణయ్య (40) కేసులో భార్య లక్ష్మీదేవితో పాటు తోడల్లుడు ఎర్రన్న, మరో ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ వి.శ్రీరామ్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. ఈ నెల 20వ తేదీన మలికపల్లె శ్మశానంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం హత్యగా నిర్ధారించారు. మృతుడు కంభం మండలం దరగ గ్రామానికి చందిన కృష్ణయ్యగా గుర్తించి హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దార్యప్తు ముమ్మరం చేశారు. హంతకులు అతడి భార్య, ఆమె తరఫు ఇద్దరు బంధువులు, మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. కృష్ణయ్యకు 15 ఏళ్ల క్రితం మలికపల్లెకు చెందిన లక్ష్మీదేవితో వివాహం కాగా పెళ్లయినప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నాడు.
ఇటీవల భర్త వేధింపులు భరించలేక బావలైన రంగయ్య, ఎర్రన్నలను సంప్రదించింది. వారిద్దరూ కలిసి అదే గ్రామానికి చెందిన చెన్నయ్య, పౌలుతో మాట్లాడి కృష్ణయ్యను హత్య చేయించేందుకు భార్యతో రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.20 వేలు అడ్వాన్సు తీసుకున్నారు. యథావిదిగా ఈ నెల 16న కృష్ణయ్య భార్యతో గొడవ పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత పౌలు, చెన్నయ్యలు కృష్ణయ్యను మద్యం తాగేందుకు గ్రామం బయటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. మత్తులో ఉండగా మరో గ్లాసులో పురుగుమందు కలిపి ఇచ్చారు. కృష్ణయ్య అక్కడే పడిపోయాడు. అప్పటికీ చనిపోలేదని అతడి లుంగీనే మెడకు చుట్టి చంపేశారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కాలువలో పడేశారు. మట్టివేసి పూడ్చేలోగా తెల్లవారడంతో ఎవరైనా చూస్తారని భావించి కొంచెం పూడ్చి వదిలేసి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment