టీ.నగర్ : తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయంలో ఆత్మాహుతికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రుణంగా తీసుకున్న నగలు, నగదు ఎగ్గొట్టేందుకు ఈ నాటకం ఆడినట్లు తెలిసింది. నెల్లై జిల్లా, కలక్కాడు సమీపంలోని చిదంబరపురం మేలరథవీథికి చెందిన కృష్ణవేణి (25), భామామీనా (26). వీరి భర్తలయిన మురుగన్,పుగళ్ సేట్టు సోదరులు. గత నెల 27వ తేదీన నెల్లై కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే జరుగుతుండగా కృష్ణవేణి, భామామీనా కిరోసిన్ క్యాన్‌తో అత్మాహుతికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారు కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్‌కు ఇచ్చిన ఫిర్యాదులో చిదంబరపురానికి చెందిన నలుగురి వద్ద కంతు వడ్డీకి నగదు తీసుకున్నట్లు, నగదు చెల్లించిన తర్వాత కూడా వారు వడ్డీ కోరుతూ బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీని గురించి కలక్కాడు పోలీసులకు తెలిపినా విచారణ జరపలేదని ఆరోపించారు.
ఇలా వుండగా సేతురాయపురానికి చెందిన వసంతా (80) కలక్కాడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణవేణి, భామామీనా తన బంధువులని, వారు 2018లో నగదు సాయం కోరగా నిరాకరించానని, రెండు రోజుల తర్వాత వారు తమ భర్తలతో వచ్చి నగదు కోరారని, ఆ సమయంలో తాను నగదు లేదని చెప్పి 15 సవర్ల బంగారు చెయిన్, ఐదు సవర్ల నెక్లెస్, గాజులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నగలను ఐదు నెలల తర్వాత ఇస్తానని చెప్పిన వారు తిరిగి ఇవ్వలేదన్నారు. నగలు అడిగితే హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కృష్ణవేణి, మరుగన్, భామామీనా, పుగల్‌సేట్, మురుగన్ తల్లి మయిల్‌పై కేసు నమోదు చేశారు. కృష్ణవేణి, భామామీనాలను అరెస్టు చేసిన పోలీసులు మురుగన్, పుగల్‌సేట్, మయిల్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment