కోహెడరూరల్(హుస్నాబాద్): పత్తి చెనులో మహిళల మధ్య జరిగిన దూషణలు.., పొలం వద్ద దారి విషయంలో తరచూ గొడవల కారణంగా ఓ మహిళను విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేసిన దురదృష్టకరమైన సంఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. ఎస్‌ఐ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన గుగులోతు జ్యోతి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుగులోతు హంస, స్వరూపల వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి తండా గ్రామ పరిధిలో ఉంటాయి.
ఈ క్రమంలో వ్యవసాయ బావులకు వెళ్లే రహదారిపై ఆ మహిళలు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని గమనించారు. కృష్ణ అనే వ్యక్తి సాయంతో జ్యోతిని ట్రాక్టర్‌లో బలవంతంగా ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకువెళ్లి స్తంభానికి కట్టి చెప్పులతో దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు 100కు కాల్ చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం బాధితురాలి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, కైలు, రమలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment