చీటీల టోకరా సూత్రధారి రాజ్యలక్ష్మి , పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బాధితులు
శ్రీకాకుళం సిటీ : నగరంలోని ఇలిసిపురం పరాంకుశనగర్‌కు చెందిన ఓ మహిళ చీటీల పేరుతో రూ.22 లక్షలకు టోకరా వేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు, బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇలిసిపురం పరాంకుశనగర్‌లో బోణె రాజ్యలక్ష్మి, రాజేశ్వరరావు దంపతులు చాలా కాలంగా నివసిస్తున్నారు. రాజ్యలక్ష్మి సుమారు పదేళ్ల క్రితం నుంచి చీటీలు వేస్తున్నారు. ప్రారంభంలో సక్రమంగా మొత్తాలు అందిస్తూ స్థానికంగా నమ్మకం పెంచుకుంది. ఇదే అదనుగా పెద్దపెద్ద చీటీలను వేసి లక్షలాది రూపాయలు వసూలు చేయడం ప్రారంభించింది.
కొందరి నుంచి ఎక్కువ వడ్డీ ఆశ చూపి లక్షలాది రూపాయలు తీసుకుంది. కొన్నాళ్లుగా చీటీలు పాడుకున్నవారికి డబ్బు ఇవ్వకపోవడంతో ఆమెపై అందరికీ అనుమానం పెరిగింది. అదే సమయంలో దంపతులు కనిపించకుండాపోవడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. వారు రంగంలోకి దిగి ఆ దంపతులను ఎలాగోలా స్టేషన్‌కు రప్పించారు. మంగళవారం వారిద్దరూ రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారన్న విషయం తెలిసిన బాధితులంతా ఒక్కసారిగా స్టేషన్‌కు చేరుకున్నారు. రాజ్యలక్ష్మిని, ఆమె భర్త రాజేశ్వరరావులను నిలదీశారు. ఈ సమయంలో బాధితులు, చీటీదారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో 22 మంది బాధితులకు ఇవ్వాల్సిన చీటీల నగదు వివరాలను పోలీసులు లెక్కించారు. ఆ మొత్తం సుమారు రూ.22 లక్షలుగా పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులు సూచించగా ఆమె ఐదేళ్లు గడువు కావాలని కోరడంతో బాధితులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ తమకు జరిగిన మోసంపై రెడ్డి దేవితో పాటు బాధితులంతా ఫిర్యాదు చేయడంతో రెండోపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment