
బంజారాహిల్స్: బతుకమ్మ, దసరా పండుగకు పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగిన ఓ మహిళ ఇద్దరు చిన్నారులతో సహా అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, అయాతపూర్ గ్రామానికి చెందిన రాములు–రాధ దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో అద్దెకుంటున్నారు. రాములు తాజ్‌మహల్ హోటల్‌లో పని చేస్తుండగా రాధ గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తులు. ప్రస్తుతం రాధ ఆరు నెలల గర్భవతి. దసరా నేపథ్యంలో ఈ నెల 25న తాను పుట్టింటికి వెళ్తానని రాధ భర్తను కోరింది. పండుగ ముందు రోజు వెళ్ళొచ్చనని చెప్పి రాములు డ్యూటీకి వెళ్ళిపోయాడు. దీంతో ఈ నెల 26న తెల్లవారుజామున రాధ తన ఇద్దరు పిల్లలతో సహా భర్తకు చెప్పకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాములు భార్య లేకపోవడంతో పరిసరాల్లో గాలించాడు. అత్తవారింట్లో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment