స్వాతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ
నెల్లూరు(క్రైమ్): వరకట్న దాహం ఓ వివాహిత ని ండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరులోని బుజబుజనెల్లూరులో చోటుచేసుకుం ది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నా యి. బుజబుజనెల్లూరుకు చెందిన కె.లక్ష్మణరాజుకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె స్వాతి (22)కి ఐదు సంవత్సరాల క్రితం కలువాయి మండలం కుల్లూరు రాజుపాలెంకు చెందిన ఎం.శ్రీహరితో వివాహమైంది. ఆ సమయంలో స్వాతి కుటుంబసభ్యులు భారీగానే కట్నకానుకలిచ్చారు. కొంతకాలం స్వాతి, శ్రీహరిల సంసారం సజావుగా సాగింది.
తీవ్ర వేధింపులు
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారి కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. మరింత కట్నం తీసుకురావాలంటూ శ్రీహరి తన భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. మద్యం సేవించి ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. అతని దెబ్బలు, వేధింపులు తాళలేని స్వాతి తన అత్త సుబ్బమ్మకు చెప్పింది. కొడుకును మందలించి కాపురాన్ని చక్కదిద్దాల్సిన సుబ్బమ్మ అందుకు భిన్నంగా అతడిని వెనకేసుకుని వచ్చేది. తల్లీకొడుకులు కలిసి స్వాతిని ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో స్వాతి అత్తింటి వేధింపులను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో లక్ష్మణరాజు అల్లుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి మారలేదు. దీంతోఅతను అల్లుడు, కుమార్తెతో పాటు సుబ్బమ్మను కలువాయి మండలం కుల్లూరు రాజుపాలెం నుంచి తీసుకుని నెల్లూరుకు వచ్చాడు. బుజబుజనెల్లూరులోనే కాపురం పెట్టించారు. అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకోసాగాడు. అయినా శ్రీహరి మారకుండా నిత్యం మద్యం సేవించి స్వాతిపై వేధింపులు అధికం చేశాడు.
తండ్రి వెళ్లేసరికే..
ఈనెల 10వ తేదీ రాత్రి శ్రీహరి తన భార్య స్వాతిని తీవ్రంగా కొట్టాడు. ఆమె పెద్దపెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఆమె తండ్రి లక్ష్మణ రాజుకు విషయాన్ని తెలియజేశారు. ఈలోగా స్వాతి తన ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లక్ష్మణరాజు కుమార్తె వద్దకు వెళ్లేసరికే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సహాయంతో ఆమెను కిందకు దించి హుటాహుటిన బొల్లినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి స్వాతి మృతిచెందింది. తన కుమార్తె మృతికి అల్లుడు, అతని తల్లి కారణమని బాధిత తండ్రి ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మృతదేహాన్ని నెల్లూరు నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ పరిశీలించారు. రెవెన్యూ అధికారులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీహరి, సుబ్బమ్మలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment