
హైదరాబాద్: తన భర్తతో నెలకొన్న స్పర్థల కారణంగా అతని వద్దకు వెళ్లేందుకు ఇష్టంలేని ఓ గృహిణి తన పిల్లలను అంతమొందించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.ఎల్‌బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జనగాం జిల్లా ధర్మసాగర్ మండలం, మల్లికుదుర్లకు చెందిన కుంట యాదగిరి, లక్ష్మీ భార్యాభర్తలు. వారు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం వుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె స్రవంతి(28)కి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పాయిగూడెంకు చెందిన కత్తుల రమేశ్‌కు ఇచ్చి 12ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి సాయితేజ (10) సాత్విక (6) పిల్లలు.కాగా రమేశ్ మాససిక స్ధితి సరిగా లేనందున దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసిగిన స్రవంతి 5 ఏళ్ల కిందట ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడే ఇళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటోంది.
భర్త వద్దకు వెళ్లేందుకు ఇష్టం లేక..
కాగా దసరా అనంతరం తమ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి స్రవంతిని అత్తారింటికి పంపే ఏర్పాట్లలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రయత్నం స్రవంతికి ఇష్టం లేదు. దీంతో వారు శుక్రవారం పనులకు వెళ్లిన సమయంలో ఆమె కొంతసేపు బయట గడిపి తిరిగి 10 గంటలప్పుడు ఇంటికి చేరుకుంది. బయట నుంచి వస్తూ పురుగుల మందు వెంట తెచ్చుకుని చక్కెరతో కలిపి పిల్లలకు అన్నంతో తినిపించి తానూ తిన్నది. అనంతరం బాత్‌రూమ్ లోని హీటర్‌తో పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి, తాను కూడా షాక్ పెట్టుకుంది.
ఈలోగా బయట నుంచి వచ్చిన తల్లి లక్ష్మి ఇంట్లో ఘటనను చూసి భయంతో చుట్టు ప్రక్కల వారికి తెలిపింది. వారు వచ్చేసరికి పిల్లలు చనిపోయివున్నారు. కొన ఊపిరితో ఉన్న స్రవంతిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె 108 వాహనం లోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్రవంతి భర్త మానసిక స్థితి బాగోలేకపోవటం, శారీరక బాధలు పెడుతుండటంతోనే స్రవంతి అతని వద్దకు వెళ్లేందుకు నిరాకరించినట్లు స్థానికులు తెలిపారు.