‘నేను మున్సిపల్ చైర్మన్ కాబోతున్నాను.. నిన్ను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా నామినేటెడ్ పదవి కూడా ఇప్పిస్తా’ అని ఒక టీడీపీ కౌన్సిలర్ మరో మహిళా కౌన్సిలర్ నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడు. అతను చైర్మన్ కాదు కదా వైస్ చైర్మన్‌గా కూడా కాలేకపోయాడు. దాంతో ఆ మహిళ కొద్ది రోజులుగా తనకు డబ్బు ఇవ్వాలని అతనిపై ఒత్తిడి చేస్తోంది. అతను పట్టించుకోకపోవడంతో ఆమె సోమవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో పంచాయితీ చేస్తున్నట్లు సమాచారం.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేస్తున్న పేట రాధారెడ్డి (బీసీ వర్గానికి చెందిన వారు) పది నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. తిరిగి బీసీలకే చైర్మన్ పదవి అప్పగిస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాను చైర్మన్ అవుతానని టీడీపీకి చెందిన ఓ కౌన్సిలర్ అందరితోనూ చెప్పుకున్నాడు. అంతేగాక తాను చైర్మన్ అయితే ఆర్థికంగా ఆదుకోవమే కాకుండా నామినేటెడ్ పదవిని ఇప్పిస్తానని మరో మహిళా కౌన్సిలర్ నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడు. ప్రభుత్వ పెద్దలు రాజకీయ సమీకరణల్లో భాగంగా బీసీలను కాదని అగ్రకులానికి చెందిన ముత్యాల పార్థసారథికి ఐదు నెలల క్రితం చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మహిళా కౌన్సిలర్ తన వద్ద తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ నేత పట్టించుకోకపోవడంతో సోమవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేయడమే కాకుండా కేసును నమోదు చేయాలని కోరింది. పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇద్దరినీ పలిపించి పంచాయితీ చేస్తున్నట్టు సమాచారం.
వారే పరిష్కరించుకుంటామన్నారు
న్యాయం చేయాలంటూ ఓ మహిళ మాకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత సమస్యను మేమే పరిష్కరించుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. అంతేతప్ప మాపై ఒత్తిళ్లు లేవు. పంచాయితీ చేయలేదు.
– వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment