
యశవంతపుర: స్నానం గదిలో గ్యాస్ లీకై భర్త, భార్య అనుమానాస్పదరీతిలో మరణించిన ఘటన బెంగళూరు రాజరాజేశ్వరినగర పోలీసుస్టేషన్ జరిగింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. వివరాలు.. పట్టణగెరెలోని శివగంగా అపార్ట్‌మెంట్‌లో ఐటీ ఇంజినీరు మహేశ్ (32), భార్య శీల (29)తో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం స్నానం చేస్తుండగా గీజర్‌కు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు లేచి మహేశ్‌ను చుట్టుముట్టాయి. భర్త కేకలు విని శీల రక్షించేందుకు వెళ్లి ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ కాలిన గాయాలతో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం సాయంత్రం మరణించారు.
అనుమానాలు.. విచారణ
లీకైన గ్యాస్ వెంటిలేటర్ లేని కారణంగా బయటకు వెళ్లక పోవటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు అనుమానించారు. ఇప్పుడు బార్యభర్తల మృతిపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. దీనితో పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. స్నానాల గదికి వెంటిలేటర్ ఎందుకు వేయలేదు, గ్యాస్ ఎలా లీకైంది అనేది ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిని వేలిముద్రలు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. రాజరాజేశ్వరినగర పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల స్వస్థలం చిత్రదుర్గం జిల్లాగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment