
పట్టుబడిన నిందితులు
సాక్షి, బెంగళూరు: భర్త రెండో పెళ్లి చేసుకుని దూరమవడంతో.. ఓ భార్య అతనికి దగ్గరయ్యేందుకు కిడ్నాప్ పథకం రచించింది. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలిచ్చి భర్తను కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సయ్యద్ షేక్, రోమా షేక్ దంపతులు మరథాహళ్లిలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం రత్న కౌతం అనే మహిళను సయ్యద్ రెండోపెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి మొదటి భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. రోమా వద్ద ఉన్న ఆభరణాలు, నగదును కూడా రత్నకు సయ్యద్ ఇచ్చేశాడు.
ఎంత చెప్పినా భర్త ప్రవర్తనలో మార్పురాలేదు. సయ్యద్‌ను తన వద్దకు రప్పించుకోవాలని రోమా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ బెడిసికొట్టాయి. చివరికి బలవంతంగానైనా సయ్యద్‌ను ఇంటికి రప్పించాలని ఆమె ప్లాన్ వేసింది. అభిపేక్, భరత్, ప్రకాశ్, చెలువరాజు సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించి భర్త కిడ్నాప్‌నకు ఒప్పందం చేసుకుంది. వారికి రెండు లక్షలు ముట్టజెప్పింది.
జూన్ 7వ తేదీ మధ్యాహ్నం సమయంలో సయ్యద్ కూరగాయల కోసం బయటకొచ్చాడు. కారులో వచ్చిన నిందితులు అతన్ని అపహరించారు. అతని రెండో భార్య రత్నకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ఆమె బాగలగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా నాగమంగళ తాలూకా బీజీఎస్ టోల్ వద్ద నిందితులను అరెస్ట్ చేసి సయ్యద్ షేక్‌ను రక్షించారు. మొదటి భార్య వద్ద ఉన్న డబ్బు, బంగారు నగలను సయ్యద్ తీసుకెళ్లి రెండోభార్యకు ఇచ్చినందువల్లనే అపహరించినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
(చదవండి: ప్రాణం తీసిన చేప)
Comments
Please login to add a commentAdd a comment