గుర్తుపట్టని విధంగా మారిన రమణమ్మ మృతదేహం , రమణమ్మ (ఫైల్ )
వెంకటాచలం: రొయ్యలగుంట వద్ద వంటమనిషిగా ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపిన విషయం బుధవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిల్లకూరు మండలం మోమిడి గ్రామానికి చెందిన దారా రమణమ్మ (40) భర్త వల్లయ్య చనిపోయాడు. కుటుంబ భారం ఆమెపై పడింది. దీంతో కొన్నేళ్లుగా మండలంలోని పూడిపర్తిలో నెల్లూరు నగరానికి చెందిన కోటారెడ్డి రొయ్యలగుంటల వద్ద వంటమనిషిగా చేరి రాత్రివేళల్లో కూడా అక్కడే ఉండేది. ఈ క్రమంలో ఈనెల 21వ తేదీన రాత్రి రమణమ్మ అదృశ్యమైంది. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌బైక్‌లపై తనను కొట్టి రమణమ్మను తీసుకెళ్లారని గుంటల వద్ద వాచ్‌మన్‌గా ఉన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ధనుంజయ చెప్పాడు. మంగళవారం ఈ విషయాన్ని యజమాని కోటారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తన్నీరు నాగరాజు చుట్టుపక్కల గ్రామాల్లో, అడవుల్లో గాలించారు.
కండలేరు క్రిక్‌లో తేలిన శవం
పూడిపర్తి రొయ్యలగుంటలకు ఆనుకుని ఉన్న కండలేరు క్రిక్ కాలువలో శవం ఉందనే విషయాన్ని బుధవారం జాలర్లు గుర్తించారు. ఈ విషయాన్ని పూడిపర్తి గ్రామస్తులకు, పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రమణమ్మ బంధువులు పడవలో క్రిక్ వద్దకు చేరుకున్నారు. శవాన్ని గోనెసంచిలో కట్టి వేసిఉండటంతో పడవలో వేసుకుని బయటకు తీసుకువచ్చారు. తర్వాత తొలగించి చూడగా మృతదేహం రమణమ్మదేనని ఆమె కుమారుడు జైపాల్, బంధువులు గుర్తించారు. శరీరంపై ఉన్న రక్తగాయాలను బట్టి ఆమెను తీవ్రంగా కొట్టి చంపేసి కండలేరు క్రిక్‌లో పడేశారని పోలీసులు భావిస్తున్నారు.
అతడిపైనే అనుమానాలు
వాచ్‌మన్ ధనుంజయ ఈ ఘాతకానికి పాల్పడి ఉంటాడన్ని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రమణమ్మకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఇతరులు వచ్చి చంపాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. నిత్యం గుంటల వద్దనే ఉండే ధనుంజయ మరో వ్యక్తి సహాయంతో కొట్టి చంపి కట్టుకథలు అల్లుతున్నాడని చెబుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సై తన్నీరు నాగరాజులు పూడిపర్తి వెళ్లి పరిశీలించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment