భూమమ్మ (పైల్)
సాక్షి, సంగారెడ్డి: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం పట్టణ సీఐ డి.వెంకటేష్ తెలిపారు. అప్పుగా ఇచ్చిన రూ.95 వేలను తిరిగి ఇమ్మన్నందుకే భూమమ్మ అనే మహిళను భార్యభర్తలైన మన్నె వీరేశం, రేణుకలు హత్య చేశారని తెలిపారు. రాజంపేట కాలనీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న యెర్ర భూమమ్మ (41) భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు భూమమ్మ హత్యపై అన్ని కోణాల్లో కేసును పరిశోధించామన్నారు.
భూమమ్మది టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామం అని తెలిపారు. రాజంపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు పని చేస్తున్న నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి కాలనీకి చెందిన మన్నె వీరేశం, అతని భార్య రేణుకలను ఈ కేసు విషయమై విచారించామన్నారు. వీరేశం భూమమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను డబ్బులు అడిగాడు. దీంతో ఆమె తన భర్తకు తెలియకుండా రూ. 95 వేలు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగివ్వమని అడగడంతో 7 నెలల క్రితం కిరాయి గది ఖాళీ చేసి నర్సాపూర్‌కు వెళ్లారు.
డబ్బుల కోసం ఫోన్ చేస్తుండడంతో వీరేశం అతడి భార్య రేణుకలు ఇద్దరు కలిసి భూమమ్మను చంపాలని పథకం వేశారన్నారు. ఈ క్రమంలో మే 11న దౌల్తాబాద్‌కు రమ్మని చెప్పి ఓ చెరువు వద్ద ఫుల్లుగా మద్యం తాగించడంతో భూమమ్మ స్పృహ కోల్పోయింది. ఈ సమయంలో వీరేశం, రేణుకలు ఇద్దరూ కలిసి బండరాయితో భూమమ్మను కొట్టి చంపి వేశారు. అనంతరం సెల్‌ఫోన్, వెండి కాళ్ల కడియాలు, పుస్తె, గుండ్లు ఎత్తుకెళ్లి సాక్ష్యం లభించకుండా చేశారని చెప్పారు. ఒంటిపై బట్టలు తొలగించి సంగారెడ్డి గాలి పోచమ్మ గుడి దగ్గర చెరువులో శవాన్ని వేశారని వివరించారు. నిందితులను అరెస్టు చేసి ఈ నెల 16న జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment